Thursday, December 8, 2016

రెండూ నువ్వే!


-ఝాన్సీ పాపుదేశి
~

ఈరోజు ఉదయం నుంచీ తార ఎందుకో చాలా ఎక్కువగా గుర్తొస్తోంది.
తారంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒకరిపట్ల ఒకరికి ఇష్టం కలగడానికి, స్నేహం పెనవేసుకోవడానికి , గౌరవం పెరగడానికి ప్రేమించే మనసు సరిపోతుంది. కానీ దాన్ని బహిరంగంగా ప్రకటించాలంటే … సమాజం వొప్పుదల కావాలి. లేదంటే మనకున్న మర్యాద గంగలో కలిసిపోదూ!   ఒక శరీరం ..ఒక మనసు రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తుందో..ఎలా ప్రవర్తిస్తుందో తలుచుకుంటే నాకెప్పటికీ ఆశ్చర్యమే!
తారతో నా పరిచయం ఆరునెలలు. ఈ ఆర్నెల్లలో తనను చాలాసార్లే కలిశాను. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎప్పుడూ కలలో జీవిస్తున్నట్టు ఉంటుంది తార. తన అసలు పేరు తార కాదు. అసలేమిటో చెప్పడానికి తనకు ఇష్టం వుండదు. అందుకే ఎప్పుడూ నేను కూడా అడగాలని ప్రయత్నించలేదు. తారను కలిసిన ప్రతిసారీ తన అందానికి, దానికి చాలా వోపికగా మెరుగులు దిద్దే తన నైపుణ్యానికి నాకెప్పుడూ ఆశ్చర్యంగా వుంటుంది. అంత అందంగా వున్న తారను చూస్తే ఒక్కోసారి అసూయగా కూడా వుంటుంది. నేనెందుకు అంత అందంగా లేనని దిగులుగా కూడా వుంటుంది.
ఎప్పుడూ తానో కురిసే జడి వానలా వుంటుంది. గడగడా మాట్లాడుతుంది. అందరినీ ఆటపట్టిస్తూ నవ్వుతూ తుళ్ళుతూ వుంటుంది. చాలా సున్నిత విషయాలకు స్పందిస్తుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. బలంగా వుంటూనే బలహీనంగా కనిపిస్తుంది. అన్నట్టు తారతో నా పరిచయం ఎలా జరిగిందో చెప్పలేదు కదూ!
ఆర్నెల్ల క్రితం నా మరో స్నేహితురాలు చంద్రిక ఒక మీటింగ్ కి తోడుగా రమ్మంటే తనతో వెళ్లాను. చంద్రిక ఒక ఎన్జీవో నడుపుతుంది. అనాధ పిల్లల సంక్షేమం కోసం తను పని చేస్తుంది. నాకూ ఆరోజు ఇంట్లో ఉండాలంటే కాస్త బోరు కొట్టి చంద్రిక ఫోన్ చెయ్యగానే వెళ్ళిపోయాను. అదుగో ..అక్కడే పరిచయం అయింది నాకు తారతో. నాకు కొత్త వ్యక్తులతో మాట్లాడటమంటే ఏదో తెలియని భయం. కానీ కొత్త వ్యక్తిత్వాలను పరిశీలిస్తూ వారిని అర్థం చేసుకోవడం చాలా ఇష్టమైన పని. ఆ మీటింగ్ లో చాలామందే వున్నా తార ఒక్కటే నా దృష్టిని ఆకర్షించింది.
తార అమ్మాయిగా మారిన ఒక అబ్బాయి.  పెద్దకొడుకుగా పుట్టినా పదేళ్ళు రాగానే తన శరీరంలో వచ్చిన మార్పుల్ని అపనమ్మకంతో , భయంతో అర్థం చేసుకున్న ధీర. ఇంట్లో వారికంటే ముందు తన శరీరంలోని మార్పుల్ని స్నేహితులు గుర్తించి పెట్టిన పేరు ఆమె మనసులో సుడిగుండాల్నే రేపాయి. స్కూలుకు వెళ్ళకుండా యేడాది పాటూ అర్థంకాని శరీరాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయి స్నేహితుల హేళన తప్పించుకున్నా అమ్మానాన్న, తమ్ముడి దృష్టిని తప్పించుకోవడం తన వల్ల కాలేదు.  శరీరంలో కరుకుదనం కంటే పెరుగుతున్న లాలిత్యం, సౌకుమార్యం వారికి తారపై ప్రేమను చంపేసింది. ఆడదాన్లా ప్రవర్తించద్దని వారు తిడుతుంటే ..ప్రవర్తించడం ఏమిటి…తాను ఆడదైతే! మగవారి బట్టలేసుకుని మగవాడిలా తిరగడం ఏంటని ప్రతిరోజూ రాత్రిళ్ళు ఏడ్చేది. శరీరంలో ఇమడని తన మనసుని ఎప్పటికప్పుడు వోదార్చుకునేది. చివరకు కన్నవాళ్ళను వొదిలేసి తనలాంటి వాళ్ళను కలుసుకున్నప్పుడు పూర్తిగా తారలా మారిపోయింది.   అలా మారిన తారనే నేను కలిశాను. అసలు తార జీవితం గురించిన కుతూహలమే నాకు ఆమెతో స్నేహం చేసేలా ప్రోత్సహించింది.  ఎందుకంటే అప్పటి వరకు నాకు ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ లేదు మరి.  తార పరిచయం అయినప్పటి నుంచి తనను పూర్తిగా పరిశీలించడం మొదలుపెట్టాను.
తార బొంగురు గొంతుతో మాట్లాడుతుంది. అదొక్కటే తనలాంటి వాళ్ళతో ఉన్న పోలిక. అందర్లాగా చూడగానే తనేమిటో తెలిసిపోయేలా వుండదు.  చక్కగా పోనీటైల్ వేసుకుంటుంది. గోళ్ళు పొడవుగా పెంచుకుని ఎప్పుడూ మంచి నెయిల్ పెయింట్ తో చాలా గ్రూమ్డ్ గా కనిపిస్తుంది. లోపల టీషర్టు వేసుకుని పైన పొడవాటి షర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది. పైకెలా అందంగా అనిపించేలా జాగ్రత్త పడుతుందో తను అంతే సౌందర్యవతి …ఆలోచనల్లో ..ప్రవర్తనలో. చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది…అలాగే ప్రవర్తిస్తుంది. అందుకేనేమో నాకు తారంటే స్పెషల్ ఇంటరెస్ట్. కొంచెం భయం కూడా…తన బోల్డ్ నెస్ చూసి.
మొదటిసారి తారను కలిసినప్పటి నుంచీ నేనే చంద్రికకు ఫోన్ చేసి మీటింగ్స్ ఎప్పుడవుతున్నాయో కనుక్కొని మరీ వెళ్తున్నా. తారతో పాటూ ఇంకో పదిమంది వొస్తారు ఆ మీటింగ్స్ కి . కానీ ఎవరూ తనంత మర్యాదపూర్వకంగా మాట్లాడరు.
నాలుగు నెలల ముందు ఒకరోజు మీటింగ్ లో చాలా ఉత్సాహంగా చెప్పింది సమీర్ తో తన పెళ్లి జరగబోతోందని. వినగానే వింతగా అనిపించింది. తనకి పెళ్ళేమిటి…విచిత్రం కాకపోతే… కానీ, ఈ మాట తనతో అనలేదు. అంటే తను నా గురించి ఏమనుకుంటుందో !  అయితే ఇంటికెళ్ళి మరో స్నేహితురాలితో చెప్పి నవ్వుకున్నాను. తారంటే నాకు నవ్వులాట కాదు. తన ముందు నా ప్రవర్తన తార అంగీకరించేలానే వుంటుంది. తన నుంచి బయటకొచ్చాక ఆటోమేటిగ్గా మారిపోతుంది.  తార తో నా పరిచయం తర్వాతే నాకు హిజ్రా జీవితాలు ఎలా వుంటాయో తెలవడం. తార ఇంట్లో అమ్మానాన్నలతో కలిసి వుండటం లేదు. అభిప్రాయబేధాలొచ్చి స్నేహితులతో కలిసి ఉంటోంది. తననెప్పుడూ అమ్మానాన్నలు ప్రేమించలేదని…అనవసర సంతానంగానే భావించారని ఒకసారి చెప్పింది. వాళ్ళు వుండమన్నట్టు తాను ఉండాలే కానీ నేను నాలా ఉండటాన్ని వారెప్పుడూ అంగీకరించరని చెప్పి ఏడ్చేది. ఇల్లొదిలి ఏడాదిపాటూ వెళ్ళిపోయానని…తరువాత వొచ్చినా ఇంట్లోకి రానివ్వలేదని…తనకిప్పుడు ఎవ్వరూ లేరంటూ వొంటరితనాన్ని ఫీలయ్యేది. చుట్టూ ఎందరున్నా హృదయానికి దగ్గరగా మిమ్మల్ని మాత్రమే తీసుకోగలుగుతున్నానంటూ చేతులు పట్టుకునేది. అప్పుడు తారతో పాటూ నేనూ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆమె బాధను నేనూ అనుభవించాను.  ఇంటికి రాగానే నా ఆలోచనల్లో కూడా మార్పు వచ్చేది.
సమీర్ తన స్నేహితుడిగా నాకు తెలుసు. వారిద్దరూ కలిసే ఉంటున్నారని కూడా విన్నా. పెళ్ళయితే ఇన్నేళ్ళ తార వొంటరితనం పోతుందని అనిపించింది. చంద్రికతో పాటూ తార పెళ్ళికి నేను కూడా వెళ్ళాను . తార కోసం కాదు. వారి పెళ్లి ఎలా వుంటుందో చూడాలని. పెళ్లి చాలా సింపుల్ గా జరిగినా తన స్నేహితులంతా పెళ్ళికి రావడంతో పొంగిపోయింది తార. ఆ రాత్రంతా ఆటపాటలతో సరదాగా గడచిపోయింది. కానీ నాకు అక్కడున్నంత సేపు నన్ను ఎవరైనా చూస్తే ఎలా అన్న కలవరం వెంటాడుతూనే వుంది.
తరువాత నెల రోజులకే నీరసంగా కనిపించింది. తార సంపాదనంతా లాక్కొని  సమీర్ పారిపోయాడని విని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆరోజు తార సమీర్ ని తిట్టినన్ని తిట్లు నేను నా  జీవితంలో అప్పటివరకు వినలేదు. నవ్వుతూనే తిట్టేది. కళ్ళల్లో దిగులు కన్నీళ్లను కనిపించకుండా అవసరం లేనిది కూడా మాట్లాడేది అప్పటినుంచి. ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం, నిజం ధ్వనించేదో అంత నటన కనిపించడం ప్రారంభించింది తనలో. తనేమిటో పూర్తిగా అర్థం చేసుకున్న నాకు తన ప్రవర్తన అసహజంగా కనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు.  తార కలలన్నీ కరిగిపోయాక మళ్ళీ వొంటరిగా రోడ్డుమీద నిలబడింది.
ఈ ఆడపిల్లలంతా ఇంతేనా? కలల్లో జీవించడం …వాస్తవాలు తెలిసే సరికి జరిగిపోయిన తప్పిదాన్ని సరిదిద్దలేని పరిస్థితిలో పడిపోవడం…మానసికంగా కృంగిపోయి దాన్నుంచి బయటకు రాలేక పోవడం.  తార మరింత బలహీనంగా కనిపిస్తోంది నాకిప్పుడు.  తన జీవితం గురించి పూర్తిగా తెలిసిపోయాక తార స్నేహం పట్ల నాకు ఆసక్తి తగ్గడం ప్రారంభించింది.
దాంతో పాటూ ఇంకో భావన. అసలు తను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎలా?తను ఆడదానిగా మారడానికి ప్రయత్నించినంత మాత్రాన ఆడదై పోతుందా? అసలు తార ఇలా ఆలోచించడమే తప్పు కదా! అందుకే ఇలా జరిగిందని అనుకునేదాన్ని. వాళ్ళ జీవితాలు అలాగే ఉండాలి అనుకునేదాన్ని కూడా!
ఇవ్వన్నీ జరిగాక తార చంద్రిక దగ్గరికి రావడం కూడా మానేసింది. తన ప్రాజెక్టు ఫండింగ్ ఆగిపోవడంతో తార వుద్యోగం కూడా పోయింది. అయినా తను నన్ను మర్చిపోకుండా  ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడేది.
mandira1
art: Mandira Bhaduri
తరువాత కొద్దిరోజులకు తెలిసింది నాకు…తను డబ్బుకోసం ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అడుక్కుంటూ వుందని … రాత్రిళ్ళు వొళ్ళమ్ముకుంటుందని. నా మనసు విరిగిపోయింది. తనకేదయినా సహాయం కావలిస్తే నన్ను అడగొచ్చు కదా? ఇలాంటి నీతిమాలిన పనులు చెయ్యడం దేనికి? ముందు నుంచి తను ఇలాగే ప్రవర్తించేదేమో! అందుకే తన ఇంట్లో వాళ్ళు తరిమేసి వుంటారు. తనకు ఇవ్వన్నీ తెలియకుండా తారతో ఇన్నిరోజులు మంచిగా మాట్లాడేసింది.  ఇక ఈ స్నేహం కొనసాగుతుందా? సమాజాన్ని ఎదిరిస్తూ, మర్యాదలేని పనులు చేస్తూవున్న తారతో తను మాట్లాడ్డం ఎవరికైనా తెలిస్తే తన గురించి ఏమనుకుంటారు? ఇక తనతో మాట్లాడ్డం తగ్గించేయాలి. వీలైనంత దూరంగా వుంటేనే తనకు గౌరవం. … ఇలా తార గుర్తొచ్చిన ప్రతిసారీ మనసుకు సమాధానం చెప్పుకునేది.
చాల రోజుల తర్వాత ఒకసారి తార పదే పదే ఫోన్ చెయ్యడంతో మాట్లాడక తప్పలేదు.  మామూలుగానే మాట్లాడేసింది. తను చెప్తోంది. బాగానే వున్నా మేడం..మిమ్మల్ని చూడాలని అనిపిస్తోంది. ఇప్పటివరకు నాతో మీ అంత ప్రేమగా ఎవరూ మాట్లాడలేదు. అస్సలు మనిషిలా కూడా చూడలేదంటే నమ్మండి. మీరు చాలా మంచివాళ్ళు …ఇలా చాలా అభిమానంగా మాట్లాడుతుంటే…ఒకవైపు ఆ పొగడ్తలకు పడిపోతూనే మరోవైపు…నువ్విలా ప్రవర్తిస్తుంటే నీతో ఎవరు మాట్లాడుతార్లే అనుకుంటున్నా.
బావుండదని అడిగాను …ఏం చేస్తున్నావు? ఏమైనా డబ్బుకావాలా …ఇబ్బంది పడుతున్నావా? అని
పర్వాలేదు మేడం..సర్దుకుంటున్నా అంది.
వొళ్ళమ్ముకుని సర్దుకున్నావా  అడగబోయి మానేశాను. నాకు తెలుసు తన సంపాదన ఎలా వుందో. ఇంక అడగడం దేనికి.  సరేనని ఫోన్ పెట్టేశాను. కానీ పదే పదే తనే గుర్తొస్తోంది. కలుద్దామంటే ఎక్కడ కలవాలి. తన భర్తకు తార గురించి తెలుసు. తనతో నీకేంటి మాటలు అన్నాడుకూడా ఓసారి. ఒకసారి కలిసి మాట్లాడుదామంటే,మంచి మాటలు చెబుదామంటే రోడ్డుమీద ఎలా కలవడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. దాంతో నేరుగా కలవాలన్న ఆలోచనను ఉపసంహరించుకుంది.

క్రమంగా అప్పుడప్పుడు మాత్రం లీలగా గుర్తొచ్చేది. ఎలా వుందో అనిపించేది. తార కూడా ఈమధ్య ఫోన్ చేయడం తగ్గించేసింది. తను ఫోన్ తియ్యకుంటే ఏం చేస్తుంది మరి. ఆ బొంగురు గొంతు వింటేనే చిరాగ్గా ఉంది. తొలినాళ్ళలో తారను కలిసినప్పుడు కలిగిన ఉత్సాహం ఇప్పుడు కొంచెం కూడా లేదు. తార కాస్త పద్దతిగా ఉండుంటే స్నేహం కొనసాగేదేమో. పద్దతంటే ? మనసు అడుగుతోంది. సమాధానం తనకూ తెలియదు. తారను అసహ్యించుకోవడం తప్ప. తన  గురించి మొత్తం తెలిసిపోయాక ఇక తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కడుంటుంది అయినా? వీళ్ళంతా ఇంతే అనిపిస్తోంది.
కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. తియ్యాలని లేదు. కానీ తనేమైందో  తెలుసుకోవాలన్న కోరిక.. ఒక రకంగా చెప్పాలంటే …ఎదుటివాడి జీవితంపై ఉన్న ఆసక్తి… ఫోన్ తీశాను. ఈసారి తను సాయం అడిగింది. డబ్బేమో అనుకున్నాను. కానీ ఎక్కడైనా వుద్యోగం ఇప్పిస్తారా అని అడిగింది.. తార డిగ్రీ వరకు ప్రైవేటుగా చదువుకుంది సరే… కానీ తనకు ఎవరు వుద్యోగమిస్తారు. గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. నేను చెయ్యగలనా? అందుకే వెంటనే చెప్పాను….
చూడు తారా నీకు కొంచెం డబ్బు కావలిస్తే సర్దగలను …ఉద్యోగమంటే ఎవరికి చెప్పను …నాకంత సామర్థ్యం లేదు అని.
కొంచెం నిరుత్సాహపడింది.
ప్రయత్నిస్తానని చెప్పాను. కానీ మనస్ఫూర్తిగా సహాయం చెయ్యాలని లేదు. తనకు బాగా పరిచయమున్న ఇద్దరు ముగ్గురిని మాత్రం అడిగింది. సరే అన్నవాళ్ళంతా తార ఇంటర్వ్యూ కి వెళ్ళగానే, తనను చూడగానే మనసు మార్చుకున్నారు. తనకు పని తెలియదని ఒక్కరంటే….తనలాంటి దాన్ని ఆఫీసులో కూర్చోబెడితే ఏమవుతుందో అన్న భయాన్ని మరొకరు ప్రకటించారు.  ఇది నాకు ముందే తెలుసు.
తారతో అదే విషయాన్ని చెప్పాను. తను చేస్తున్న పనుల వలన చెడ్డపేరు వొచ్చిందని …అవన్నీ మానెయ్యమని  సలహా కూడా ఇచ్చాను.  పగలబడి నవ్వింది. తార గుర్తొచ్చినప్పుడంతా ఆరోజు ఆమె అన్న మాటలు ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తూనే వుంటాయి.
“మేడం…ఇన్ని రోజులనుంచి మనిద్దరం స్నేహితులం కదా ….రోడ్డులో కనీసం మీరు నా పక్కన నడవగలరా… ఎక్కడైనా కనిపించి పలకరిస్తే మాట్లాడగలరా…కనీసం ఒక్క రోజైనా మీ ఇంటికి ఆహ్వానించగలరా? నన్ను సమాజం స్వీకరించదు. మీరు నాగురించి ఇంత ఆలోచిస్తారు కదా!  మరి ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి పిలవలేదేం? మీ ఇంట్లో వాళ్లకు, పక్కింటోల్లకు పరిచయం చెయ్యలేదేం ? అంతెందుకు ..మొన్న బస్టాండులో నేను కనిపిస్తే చూడనట్టు మీరు మొహం తిప్పుకుని వెళ్లిపోలా ?” తార  ప్రశ్నించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో చెప్పలేని అసహనం పుడుతోంది వొంట్లో. తారతో స్నేహం చేసి తానేదో సాయం చేసినట్టు కదూ అనుకుంటోంది. మరి తననే ప్రశ్నించడమా?
“ఈ తిరస్కారం నాకు ఎప్పుడో అలవాటైపోయింది. కానీ మీరంటారు చూడూ …సమాజంలో బతకండి…సమాజపు కట్టుబాట్లలో నడవండి…అందరిలాగా గౌరవంగా నడుచుకోండి అని…ఆ కపటత్వాన్ని వదలండి. వాస్తవాలు చూడండి. నేనూ మనిషినే మేడం…కానీ మీ జీవితాల్లో నా అస్తిత్వం ఏదీ? స్వీకారం ఎక్కడా?? నాకు ఏ పనిలో బతకడానికి సాయం అందుతుందో అది దైవ సమానం. రోజంతా ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చుకదా అని నీతులు చెప్పే మగవాళ్ళు రాత్రి కాగానే వొంటరిగా కనిపిస్తే రాళ్ళేసి పిలుస్తారు. నన్ను గౌరవప్రదమైన స్థానంలో చూడాలనుకుంటే నన్ను నన్నుగా చూడగలిగే స్థాయి ఉన్నచోట ఏదైనా చిన్న వుద్యోగం ఇప్పించండి. కానీ అది మీకు ఎప్పటికీ సాధ్యం కాదు. కన్న తల్లిదండ్రులే నన్ను స్వీకరించలేక పోయాక ఇంకెవరికైనా నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది. మీక్కూడా నేను అడుక్కోవడం, వ్యభిచరించడం మాత్రమే తెలుసు. కనీసం నాతో కళ్ళు కలపడానికి, పెంపుడు జంతువుల మీద చూపినంత ప్రేమ చూపడానికి కూడా ఎవరూ ముందుకు రారు. మేము చేసే పనిని చెడుగానే ముద్ర వేసేసింది సమాజం. నేను ఏపని చేసినా హేళనగానే చూస్తుంది. మీరు నాకు సాయం చెయ్యాలనుకుంటే నన్ను స్వీకరించండి ..కానీ నాలో తప్పుల్ని ఎత్తిచూపడం, నామీద జాలిపడటం చెయ్యకండి. నాకోసం మీరు చాలా శ్రమపడ్డారు. నాలాంటి దానితో స్నేహమేంటని కూడా కొందరికి మీపై అనుమానం వొచ్చేవుంటుంది. ఇలా పుట్టడాన్ని నేనెలా ఎంచుకోలేదో బ్రతకడానికి ఏం చేయాలో కూడా ఎంచుకోలేని అశక్తత నాది. నాలాంటి వాళ్ళు నా చుట్టూ చాలామంది వున్నారు. వాళ్ళెలా బ్రతుకుతారో నేనూ అలాగే. కాస్త భిన్నంగా వుండాలని నాకు కూడా వుండేది. కానీ సహాయం చేసేదెవరు? “ తార గొంతు మరింత బొంగురుగా మారడంతో ఫోన్ పెట్టేసింది.
తార సమాజాన్ని ఉద్దేశించే ఈ మాటలన్నా తననే అన్నట్టుంది. తను కూడా అంతేనా? విభిన్నంగా వుండే తారను స్నేహితురాలని అనుకోవడంలోనే హిపోక్రసీ ఉందా? తనది నిజమైన స్నేహమే అయితే ఆ స్నేహాన్ని నాలుగ్గోడల మధ్యే ఎందుకు ఉంచాల్సి వొచ్చింది? తన విభిన్నతను అంగీకరించిన తాను తార బ్రతుకు గడవడం కోసం ఎంచుకున్న వృత్తి పట్ల అసహ్యంతో తారను కూడా అసహ్యించుకుందా ? సహాయం చెయ్యగలిగే శక్తి వుండీ సమాజానికి భయపడి చెయ్యలేకపోయిందా ?
మరోసారి ఫోన్ మోగింది. మళ్ళీ తార. “ ఎవరేమనుకున్నా పర్లేదు మేడం. మీరు నన్ను అసహ్యించుకోకండి.  మా జీవితాలింతే. మిమ్మల్నెప్పుడూ మరిచిపోలేను. బయటెక్కడా కలవనులే ..భయపడకండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా..మాట్లాడండి చాలు”  చేతిలో ఫోన్ మెల్లగా కిందికి జారుతుంటే తార రూపం మళ్ళీ లీలగా ప్రత్యక్షమైంది.
ఈసారి తార అందమైన శరీరం తో పాటూ  తల్లిదండ్రులు కాళ్ళు విరిగేలా కొట్టినా మారని తన నడక గుర్తొచ్చింది. శరీరంలో వొస్తున్న మార్పులను అంగీకరించని మనసుతో  చిన్న వయసులోనే  ముంబాయికి పారిపోయిన తార తెగింపు కనిపించింది. రోజంతా ముంబాయ్ రోడ్లమీద అడుక్కుని…రాత్రిళ్ళు వొళ్ళమ్ముకుని కూడబెట్టుకున్న సొమ్ముతో తార పొందిన బాధాకర నిర్వాణ గుర్తొచ్చింది. మగ లక్షణాలను వొదిలించుకుని తిరిగి తల్లిదండ్రుల ముందుకొచ్చి కూతురిగా స్వీకరించమంటూ కాళ్ళు పట్టుకుంటే …బయటకు తోసి తలుపేసిన తార నాన్న ఆమె నుదుట చేసిన గాయం కనిపించింది. ఎన్జీవోలో వుద్యోగం చేసుకుంటూ పోగేసుకున్న రూపాయిలతో మామూలు ఆడదానిలా కుటుంబం కోసం పడిన ఆరాటంలో నిలువెల్లా మోసపోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ అబల కళ్ళముందుకొచ్చింది. కళ్ళముందు కన్నీటి పొరలోంచి తార ఆడ శరీరం కనిపించినా ఆమె మొహంలో ఛాయగా మొలిచిన మీసాలు…బొంగురు గొంతు …ఇప్పుడు మరింత ప్రస్పుటంగా  కనిపించాయి.
తార శరీరమేగా మారింది. మరి తాను…?? సాయం చేయలేక పోయినందుకు మళ్ళీ బాధగా వుంది.
********
Published in Saaranga Magazine.



Wednesday, July 15, 2015

మమేకం ;


ఓ మొగలిపువ్వూ ఏకమౌదామా
నా హృదయ రాగం  నీ దివ్య పరిమళంగా?
ఓ స్వాతి చినుకూ కలుపుకుంటావా నీలో
నీ చల్లదనంతో  కరిగించి నేలమ్మ వొడిలోకి?
ఓ పారిజాతమా ఒకటై నవ్వుదామా
తుళ్లిపడి జలజలా జారిపడి?
ఓ నాగమల్లీ దాచుకుంటావా నా చిన్ని గాయాన్ని

పదిలంగా  నీ చిట్టి గుండెలో ?