Monday, October 6, 2008

గోయిందల పండక్కు మా వూరికి పొయ్యి గోయిందలు పెట్టొచ్చినాం...:)

ప్రతి యేడాదీ మూడో శనివారం మా తాతకు గుడ్డలు పెడ్తాం...
ఆయన నేను చిన్నబిడ్డగా ఉన్నప్పుడే సచ్చిపోయినాడు. మా తాతకు మూడో తిరవలి శనివారం అంటే చానా ఇష్టమంట. పూజసామాను, సరుకులు తెచ్చేదానికి మోటరు బైకులో చిత్తూరుకు పోతావుంటే లారీనో, బస్సో గుద్దేసిందంట. అక్కడ్నుంచి బస్సులో పెద్దాసుపత్రికి యేసుకోని పొయ్యేటప్పటికే సచ్చిపోయినాడంట. పండక్కు ముందు రోజే సచ్చిపోయినాడు కాబట్టి,ఆయనకు గోయిందల పండగంటే ఇష్టం కాబట్టి మా తాతకు ఆరోజే గుడ్డలు పెడ్తాం.ఆరోజు ఇంట్లో పూజ అయిపోయినాక ఈదిలోగూడా పూజ్జెయ్యాల. ఇంటిముందర నీళ్ళుజల్లి, సలిబిండి దీపం పెట్టి, కర్పూరం దిగదియ్యాల. అయినాక మూడుసార్లు గోయిందలు పెట్టాల. ఆరోజు ఇంట్లో మొగోళ్ళందురూ నాముకొమ్ము రుద్ది యెంగటేస్పర సామి నామాలు మాదిరిగా పెట్టుకోవాల.

గోయిందల పండక్కని మేమందురూ మా తాతోళ్ళ ఊరికి పోయినాం ...మొన్న మూడో శనివారం.అరిటాకులు కూడా ఇక్కడ్నుంచే కొనుక్కోని పోయినాం. అందురూ వక్కపొద్దు ఆ రోజు. నట్టింట్లో తళిగేసి, మా తాతకు ఇష్టమైన వంటలన్నీ వండి పెట్నాము. సామ్రాణి పొగేసినాము. ఇంట్లో పూజ చేసేసినారు. బయటికి వచ్చినాం. ఆడ గోయిందలు పెట్టాల ఇంక.

మేమందురూ బాగనే చదువుకునేసినాం. గట్టిగా గోయిందా! అనాలంటే అందరికీ సిగ్గు. ఇంతకు ముందొక సారి మా తమ్ముడు గోయిందా..గోయిందా..గోయింద! అనలేదని మా నాయిన వాడిని గేటు బయటే నిలబెట్టి గేటు యేసేసినాడు.' వాడు గోయిందా! అనకుంటే అన్నంగూడా పెట్టద్దని మాయమ్మకు చెప్పినాడు. వాడిప్పుడు అమెరికాకు పోయి గోయిందలు పెట్టే బాధ నుండి తప్పించుకునేసినాడు.

మావూరి వాస్తు సరిగ్గా లేకనో, పరిస్థితులు బాగలేకనో ఇప్పుడెవరూ వూర్లో ఉండటం లేదు.. నా చిన్నప్పుడు ఊరంతా మనుషులే. ఇప్పుడు ఇంటికి ఒకరు కూడా లేరు.ఈరోజో రేపో సచ్చిపొయ్యేదానికి రెడీగా ఉండేవాళ్ళు, వూరొదిలి పెట్టి యాడికి పొయ్యేదని అనుకునేవాళ్ళు కొందురు మాత్రమే ఇప్పుడు మావూర్లో ఉండారు. మేము గూడా వూర్లో ఎందుకుండేదని అప్పుడెప్పుడో టౌనులోకి వచ్చేసినోళ్ళమే. కానీ అప్పుడప్పుడు నేను చిన్నప్పుడు ఆటాడుకున్న ఊరు ఇప్పుడు శ్మశానమై పోయిందని బాధగా వుంటింది. చిన్నప్పుడు అందరూ మూడో శనివారమంటే మా ఇంటికి వచ్చి మొక్కోని పొయ్యేవాళ్ళు. అందరూ అందరిండ్లకూ పొయ్యి గోయిందలు పెట్టేసి మళ్ళి వొక్కపొద్దు ఇడిశేది.

వూరొదిలేసి వచ్చి, ఇక్కడెక్కడో ఏంది పండగ జేసేదని మా మామ వూర్లోనే ఇల్లు కట్టేసి రెండేళ్ళ నుండి ఆడే గుడ్డలు పెడ్తావుండాడు. పండక్కోసం ఊరికిపోతే చిన్నప్పుడు జరిగినాయన్నీ గుర్తొస్తా ఉంటాయి. చెట్టెక్కి ఆడుకున్న ఆటలు, జిల్లంగోడి ఆడి దోవలో వచ్చేపొయ్యే వాళ్ళ మూతి పగలకొట్టడాలు, నిద్రపొమ్మంటే అమ్మని నిద్రపించి దొంగలా బయటికొచ్చి దాయాలు ఆడటాలు...అన్నీ, అన్నీ గుర్తొస్తాయి.

బాగా సదువుకునేసి, పెద్దయిపోయినాక గోయిందలు పెట్టేదానికి కొంచెం కష్టంగానే ఉన్నా...వచ్చే సమచ్చరం వూర్లో అందురూ ఇండ్లకు తిరిగొచ్చి పండగలు చెయ్యాలని...పిన్నమ్మ,పెద్దమ్మ,చిన్నాయిన,పెద్నాయిన,అత్త,మావ,అవ్వ,తాత లతో పల్లె కళకళ లాడాలని ... మా వూరికి యాభై కిలోమీటర్ల దూరంగా కొండమింద ఉండే యెంగటేస్పర సామికి ఇనిపించేటట్టు గట్టిగా పెట్టినా .....

గోయిందా!...గోయిందా!...గోయింద!