Wednesday, July 15, 2015

మమేకం ;


ఓ మొగలిపువ్వూ ఏకమౌదామా
నా హృదయ రాగం  నీ దివ్య పరిమళంగా?
ఓ స్వాతి చినుకూ కలుపుకుంటావా నీలో
నీ చల్లదనంతో  కరిగించి నేలమ్మ వొడిలోకి?
ఓ పారిజాతమా ఒకటై నవ్వుదామా
తుళ్లిపడి జలజలా జారిపడి?
ఓ నాగమల్లీ దాచుకుంటావా నా చిన్ని గాయాన్ని

పదిలంగా  నీ చిట్టి గుండెలో ?

మిధ్య!

మిధ్య!

తొలకరి జల్లులో వొళ్ళు ఝల్లుమంటుంటే 
మట్టివాసనై పలకరించేది నీవే  
  
మల్లెల మాల కడుతుంటే పరిమళించేది ... నీవే

పల్లె సువాసనల్లో మూసిన కళ్ళ మధ్య కలగా
అగాధంలోకి జారిపోతున్న వేళ అందే ఆలంబన నీవే

తెరిచిన కళ్ళ ముందు మిధ్యగానూ నీవే                                                                                         

శ్వాసగా గుండెల్లోకి చేరి   
ప్రాణమల్లె కవ్వించేది మళ్ళీ నీవే  

నిష్క్రమిస్తున్న నీ అడుగుల చప్పుడు 

ఎదను గాయపరుస్తుంటే జ్ఞాపకాల్లో మళ్ళీ నీవే   :(

Existential దుఃఖం!

కళ్ళలో ఖాళీతనం..
బతుకును భర్తీచేసేదేదో  చేజార్చుకున్నతనం
అందమైన ఉదయాలూ అమృతం కురిసే రాత్రిళ్ళూ ,
సుడిగుండాలై తొంగి చూసే వెచ్చటి కన్నీళ్లు. 
మనసు లోపలెక్కడో విషాదంతో  సహజీవనం, 
కొత్త చర్మాలతో పైకి మరో వేషం  
కళ్ళలోనే కాదు ...శరీరమూ.. మనసూ
దోసిళ్ళ నిండా నింపుకున్న ఖాళీతనం..

ఇది భవిష్యత్తు లేనితనం!!

మొగుని రోగం ! సారంగ లో వచ్చింది

మొగుని రోగం !

పూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది  మల్లిక . ముండాకొడుకు ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో తాగినాడంటే అంత ఎదవై పోతాడు’ . పెండ్లైన మూడేండ్లు తాగేసొచ్చి దినామూ కొడ్తే గూడా యాపొద్దూ మల్లిక అడ్డం జెప్పలా . మత్తంతా దిగినాక మొగుడొచ్చి అడుక్కొంటే మూతి ముప్పై సొట్లు దిప్పి, నెత్తిన రెండు మొట్టి నెత్తిన బెట్టుకునిందే గానీ, ఈదినానికి గూడావోన్ని ఒగ  మాట అనింది  ల్యా . సుట్టుపక్కలోల్లు మద్దెలో వొచ్చి మద్దిస్తానికి  కుచ్చుంటే గూడా మొగుడన్నేక  కొట్టడా తిట్టడా  అని మరేదగా పొమ్మనే సిండాది  శానా తూర్లు . ఇప్పుడు యౌర్నన్నా పిల్సినా వోల్లింటి కల్లా తిరిగిమల్లి గూడా సూడరు . మీసావు మీరు సావండని తుపుక్కున మూసేసి పోతారు.
రెండ్నెల్ల నించి మొగుడ్నుంచి వొల్లు కాపాడుకోవాలంటే సచ్చేసావుగా వుండాది. ఎవురికన్నా సెప్పుకోవాలంటే మానంబోతా వుండాది. మొగుడూ పెళ్ళాలు కలిసేటప్పుడు జాగర్తగా వుండాలని పెద్ద డాకట్రు జెప్పినాడు. ఈడికేమో మందు లోపలికిబోతే వొళ్ళూ పై దెలవదు. బద్రంగా  లేకపోతే మొగుడికుండే  రోగం మల్లిగ్గూడ వొస్తుందని ఇవరంగా సెప్పినారు. అదేవన్నా సిన్నరోగమా. దుడ్డులేనోల్ల పాణం తీసేరోగం. మొగుడు కాలందీరిపోతే వుండే వొక బిడ్డిని ఎట్ట సమాలించాలో తెలీక అల్లాడిపోతా వుంది మల్లి. ఇంత మనేదలో వుంటే రాజుగాడికి ఈ వుపద్రం బట్టింది. సారాయితాక్క పోతే ఏ కబురైనా గెట్టిగా సెప్తే ఇంటాడు. తాగేస్తే ఇగ అంతే. నోరిప్పితే కొట్టనొస్తాడు.  మొగుడంటే యిష్టం లేగ్గాదు. బతుకంటే బయిం బట్టుకునింది మల్లికి. ఈపూట వోడ్ని పక్కలోకి రానీను గాక రానీనని వోట్టేసుకొని, బొళువుగా  వుండే మిసన్ని తలుపుకడ్డంగా ఈడ్సి పైటకొంగు తో కారే సెమటని తుడ్సుకుంట కింద కుచ్చోని అట్టా కన్నుమూసింది మల్లి.
 ***





సమర్తైనాక  రెండేండ్లు గూడా మల్లిక అమ్మగారింట్లో ల్యా . ఆబిడ్ని మల్లయ్య మావ కొడుక్కిచ్చి  ఉండూర్లోనే  పెండ్లి జేసేసినారు . రాజు దిట్టంగా ఉంటాడు . ముగ్గురి తిండి  వొకడే తింటాడు ముగ్గురి పనీ వొకడే జేసేస్తాడు. కాలు కొంచెం అవుడు. కుంటోన్ని నేను జేసుకోనని మల్లి మొండికేస్తే ,  “గుడ్డి పోగోర్తాది..కుంటి రాగోర్తాదిఅని బలవంతాన మల్లిని పెండ్లికి వొప్పించినారు. అవుడైతే ఆస్తులు కూడబెడ్తాడని పెండ్లైన ఆర్నెల్లు  మొగుడు మల్లిని వొదిలి పక్కకుబోలా. కడుపులో కొడుకు పడ్నాకనే మళ్ళీ రాజు పనికిబోయిండేది. ఈతూరి సేద్దిగం వొదిలేసి శానా దుడ్డు వొస్తాదని లారీ పనికిబొయ్ నాడు. వొగ తూరి  లారీ  ఎక్కితే మల్లీ రెండ్నెల్లు ఐనాంకనే పెడ్లాం బిడ్లను జూసేది.
లారీ పనికి బొయ్ నాక  మొదల్తూరి వొచ్చినప్పుడు బాగనే వుణ్ణాడు. దుడ్డు తెచ్చిచ్చి అంగిడికి  బొయ్యి ఒగ కోక దెచ్చుకో మన్నాడు . లారీ పని బాగుండా దని మల్లి గూడా సత్తెమ్మకు పొంగిలి బెట్టుకోనొచ్చి వూరంతా పెసాదం తలారొంత ఇచ్చి మొగుడుణ్ణె  పదైదు దినాలూ పండగ జేసింది . వోడు మల్లీ పనికిబోతాంటే దొక్కలోనుంచి దుక్కమోస్తాంటే గూడా యిన్ని నీల్లు బోసుకోని మింగేసి, బద్దరంగా పొయ్యిరమ్మని  లారీ యెక్కించి ఉత్త సేతుల్తో  ఇంటికొచ్చేసింది.
నిండునెల్లు  వొచ్చేటప్పిటికి మొగుని మాట వొదిలేసి సీమంతం  జేసుకొని అమ్మగారింటికి ఎలబారి పొయ్యింది. అటక మిందుండే కొయ్య వుయ్యాల దింపిచ్చింది . నూలుకోకలన్నీ జవిరి వైరుబుట్టిలో ఎత్తి పెట్టింది. పెద్దిల్లు పేడతో అలికిచ్చి, సుబ్బరంగా తెల్లసున్నం పుయిపిచ్చింది. మొగబిడ్డి పుడ్తిందో ఆడబిడ్డి పుడ్తిందో అనుకుంటా నొప్పులకోసరం ఎదురుసూస్కుంటా కుచ్చునింది .
ఆరోజు మల్లిక్కి బాగా గెవనం వుండాది. తెల్లార్తో నుండి కొంచిం వొంట్లో నలతగా వుణ్ణిన్ది . సగించకుంటే గూడా కడుపులో బిడ్డి కోసరం కొంచిం వుప్పిండి దినేసి గడపమింద కుచ్చోని ఎగదీసుకుంటా వుణ్ణిన్ది. కడుపులో నొప్పి మొదులయ్యే టప్పిటికి  మంత్రసాన్ని తొడుకోనొచ్చింది వోళ్ళమ్మ. దీపం గూడులో కాయితం కింద ఎత్తిపెట్టిన బ్లేడు, ఉడుకు నీళ్ళు, పాత నూలుకోకలు మంత్రసానికి ఎత్తిచ్చింది. తొలి కానుపాయఒగ రాత్రి ఒగ పొగులు అల్లాడిపొయ్యింది నొప్పుల్తో. ఆస్పిటల్ కి పోదారంటే మొగుడింట్లో లేకపాయె. మాలపల్లంతా ఒగచేతి మింద కానుపులు జేసిండే మంత్రసానిగ్గూడా బిడ్డి అడ్డం దిరిగి పోయిన్దేవోనని కాల్లూ సేతులూ ఆళ్లా. ధనియాల కసాయం దాపిచ్చికడుపుకు ఆందెం రుద్ది ఎట్టో వొగట్ట పువ్వాలుండే మొగబిడ్డిని బయటకు దీసేసింది. నాబట్ట బిడ్డె ఎంత ఏడిపిచ్చినాడు వోల్లమ్మను అనేసి ..మేయ్ఇప్పుడే నీకొడుకు ఇట్ట ఏడిపిస్తావుండాడు పెద్దయితే ఇంగేం జేస్తాడోఅంటా వక్కాకు లో బెట్టిచ్చిన నూర్రూపాయలు దీసుకొని మంత్రసాని నవ్వుమొగం తో ఎలబారిపొయ్యింది.
ఇంత జరిగినా మొగునికి ఇవేమీ దెలీలాపురిటికి గూడా రాలా.  ఇంత కస్టంలో మొగుడు పక్కన లేడని మల్లి శానా తూర్లు ఎవురికీ దెలీకుండా ఏడ్సుకునింది. పక్కలో బిడ్ను జూసుకుని మొగుని మింద కలవరాన్ని తగ్గిచ్చుకునింది. మల్లెప్పుడో ఒగనెలకు వొచ్చినాడు రాజుగాడు.  వొల్లంతా కాలిపోతా వుంది. వారం దినాల్నుంచి జొరమని జెప్పినాడు. ఏం దిన్నా వాంతులు ..బేదులు. లారీ పనికి బొయ్యేది మొదులు బెట్నాక గొంతుదాక సారాయి దాగే పని బట్నాడు. వొళ్ళు వూనమైపోతే గూడా సారాయి అంగిడికి బొయ్యేది ఇసిపెట్లా.  పక్కన పెద్ద పల్లిలో వుండే అరెమ్పీ డాకట్ర దెగ్గిరికి పొయ్యి సూదేసుకొని వొస్తే కొంచిం కుదురుకునింది వొల్లు.
అట్ట వొచ్చినోడు మూడ్నెల్లు ఇల్లు వొదల్లా.. కొడుకుతో ఆట్లాడుకుంటా వుండిపోయినాడు. మొగుడుంటే వొగపక్క సంతోసంగుంటే గూడా వోని తాగుడు జూస్తావుంటే మల్లిక్కు బయంగా వుండాది. సంపాయిచ్చుకొని వొచ్చిందంతా ఈమారి తాగేస్తా వుండాడే అని మనేద బట్టుకునింది. దాంతో బాటు రాత్రయ్యిందంటే వొల్లు బాగాలేదంటే గూడా యినకుండా పక్కకు రమ్మని ఒకటే సతాయిస్తావుండాడు. రెండో నెలకే ఈతూరి కడుపు నిలిచిపొయ్యింది. సంకలో బిడ్డి సంకలో ఉండంగానే కడుపులో ఇంగోటి. లారీ వోనరు పిలస్తావుండాడని కబురొచ్చినాక  వొదల్లేక వొదల్లేక యలబార్నాడు రాజుగోడు. బిన్నా వొస్తానని చెపేసి పొయ్ నాడు. వోడు పోతే సాలని సూసిన మల్లి కంట్లో నీల్లు రాలా ఈతూరి. మొగుడు అట్టబోగానే పక్కూర్లో వుండే ఆరెమ్పీ డాకట్రు దగ్గిరికిబొయ్యి కడుపుదీయించుకొని వొచ్చేసింది. మొగుడికివేమీ జెప్పలా.
పొయ్ నోడు పొయ్ నోడు ఈ తూరి పదైదు దినాలు గూడా గాకనే తిరుక్కో నొచ్చేసినాడు. మళ్ళీ వొల్లు బాగలా. ఇట్ట మూడుదినాలకోసారి  పడవబడి పోయ్యేవోడి తో పనికి పంచేటని వోనరు ఇంగోసారి పనికి రావొద్దని ఇంటికొచ్చి ఎచ్చరించి  పొయినాడు. సారాయి  దాగేది నిలిపైమని ఆ దరిద్దరపు తాగుడే వొల్లు పాడుజేసేస్తా ఉండాదని మల్లి రంపు బెట్టుకునింది. పనికి బొయ్యేదాని గురించి రాజుగానికిప్పుడు మనేదే లేదు. తెల్లారి లేస్తే వంక కాడుందే సారాయి అంగిడికి బొయ్యేదితాగేసొచ్చి నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేదిబండ మాట్లన్నీ మాట్టాడుకుంటా అరుగుమింద గుచ్చోనుండేది మత్తు దిగిపోయినాక మల్లీ సందేళ కాడ ఇంగోతూరి సారాయంగిడికి బొయ్యొచ్చేదివూరంతా రాజుగాడి మొకాన కారిమూస్తే గూడా వాడికి లెక్కలేకుండా వుండాది.  దీనికితోడు మూడూమూడ్రోజులకు జొరమొకటి. కొడుకుని అమ్మగారింటి దగ్గిర వొదిలేసి కూలికి బోతావుంది మల్లి.
శనారం మద్దేనం పినపెద్ద ఇచ్చిండే ఆర్నూరు రూపాయిలు దీస్కోని, మొగున్ని దొడుకోని తిరప్తి లో వుండే రుయాస్పత్రికి ఎలబారింది. వొల్లు కొంచిం కుదురుకుంటే ఎట్టోకట్ట పనిలో బెట్టేయాలని జూస్తావుంది మల్లి. ఆసుపత్రిలో రగతం పరీచ్చజేసేస్తే ఏం రోగమొచ్చిందో తెల్సిపోతుందని  డాకట్రు జెప్పినాడు. అట్నే అని రగతం ఇచ్చేసి, రెండ్రోజులు ఆసుపత్రి లోనే వుండిపోయినారు. మంగలారం కాయితాలు జూసి డాకట్రు జెప్పిన మాట ఇన్నాక మల్లికి నోట్లో మాట రాలా. అట్నే యాడస్తా కూలబడి పొయ్యింది. రాజుగాడు మాత్తరం యాడవద్దు మే ఏం గాదులే. ఎప్పుడో ఒగప్పుడు పోవాల్సిందే గదా .. నా టయుము ఐపోయిందనుకో..పైకి లెయ్ అంటా జబ్బ బట్టుకోని మల్లిని పైకి లేపినాడు. వోల్లిచ్చిన మందులు తీసుకొని నెత్తీనోరూ కొట్టుకుంటా….నా బతుకు ఎందుకిట్టా అగ్గిబడి పోయిందాని యాడస్తా ఇంటికొచ్చింది . అందురూ… “ఆస్పత్రికి పొయ్యి వోచ్చినారు గదా? ఏవిజెప్పినారని అడగతా వుంటే సెప్పలేక మల్లికి బేజారుగా వుండాది.  నా మొగుడికి ఎయిడ్సని ఎట్ట జెప్పుకునేది. సెప్తే కడుపుకిన్ని నీల్లుబోస్తారా ఎవురైనా?
రోగం ఏందో తెలిసిపోయ్యినాక పదైద్దినాల నుంచి రాజుగాడు గొమ్మునే వుంటా వుండాడు. అప్పుడప్పుడు మల్లితో, కొడుకుతో కుచ్చోని యాడస్తా నేను బోతే ఎట్ట బతకతారో!అంటా కుమల్తా ఉంటాడు.   మాయదారి జబ్బు రానన్నా వొచ్చిందిమనిషి మారిపొయ్యినాడులే అనుకునేలోపల వాడికి ఇంకో రోగం బట్టుకునింది. నేను సచ్చిపోతే నాపెళ్ళాo ఎందుకు బతకల్ల? ఆ బిడ్డె ఇంగ ఎవుర్నన్నా పెండ్లి జేసుకునేస్తిందా? నేను లేనప్పుడు  వాల్లెందుకు వుండల్ల?’ మల్లి నీల్లు పట్టకచ్చే దానికి కొళాయి కాడికి పొయ్యినా, ‘ఎవుడితో ఏం మాట్లాడేస్తా వుందోఅని బయిపడతా ఆబిడ్డికి కాపలా గాస్తా వుండాడు. ఎవుర్తో మాట్లాడ్నా,’ వాల్తో నీకేం పని?’ అని మల్లిని తిడ్తా కొడ్తా వుండాడు.
రోగం యాడ అంటుకునేస్తిందో అని రాత్తిరైతే దూరదూరంగా తిరగతా వుండే మల్లిని జూస్తే వాడి కోపమింకా ఎక్కువైపోతా వుండాది. మామూలుగా ఉండేప్పుడు కొడ్తే ఊరంతా వొగిటై పోతిందని బయిపడి, తాగేసొచ్చి కొడ్తా వుండాడు. ఈరోజెట్టయినా మల్లిని లొంగదీసు కోవాలని వాడుగూడా వొట్టేసుకున్నాడు.
తలుపులు కొట్టీ కొట్టీ రాజుగాడి బలం సచ్చిపోతా వుండాది. దాలముందరం కాడనే నిద్దర బొయ్యినాడు. తెల్లార్నీ మొగుడి కతేందో జూద్దారని మల్లి గూడా నడిజాముకాడ నిద్దరబొయ్యింది.
  టయిము నాలుగైంటింది. ఈపు మింద ఎవురో కొట్టినట్టు నిద్దర మత్తు వొదిలిపోయ్యింది రాజుగాడికి. మెల్లిగా పైకి లేసి తలుపుసందులో నుంచి ఇంట్లోకి తొంగి సూసినాడు. మల్లి మంచి నిద్దర్లో ఉండాది. గెడేసేసి తలుపుకడ్డంగా సామాన్లు పెట్టేసిండాది. సిన్నంగా తలుపు పక్కన్నే ఉండే గూట్లో కాలుబెట్టి గుడిసె పైకి ఎక్కినాడు. మెల్లిగా మనిసి పట్టేంత బోద ఎత్తి పక్కన పెట్టేసి, ఇంట్లోకి దిగి మల్లిమింద పడ్నాడు. మల్లి తప్పించుకునేదానికి వోడు సందీలా. వాడ్నించి కాపాడుకోను తలుపుకడ్డంగా పెట్టిన సామాన్లన్నీ ఆరోజు మల్లి పాణం మీదికి తెచ్చినాయి. వోడ్ని కొట్టి, తిట్టి, సాపనార్తాలు బెట్టినా లొంగిపోక తప్పలా మల్లికి.
***
ఇంత జరిగిపోయ్యినాక బతికేం జెయ్యాలని గన్నేరు పప్పు తినేసి సచ్చిపోదారని జూస్తే కొడుకుని జూసన్నా దైర్నంగా ఉండమని వోల్లమ్మ పోరుబెట్టుకునింది. ఇప్పుడు రాత్తిరైతే మల్లికి బయిం లేదు.  మొగోడంటేనే కడుపుగాల్తా వుండాది. మొగుడ్నే గాదుకొడుకుని జూస్తే గూడా. ఇట్టాంటి కొంపలో పెద్దోడై వాడెంత మంది కొంపలు కూలస్తాడో అని. మొగోడు కనిపిస్తే సాలు, దొరికిండే రాయి ఎత్తుకొని పిచ్చిదాన్లా తరుమ్కుంటా వుండాది.
ఇంగోపక్క ఆరోజు రాత్తిరి నించీ రాజుగాడికి నెత్తినుండే మూటబొళువు దిగిపోయినట్టుగా వుండాది. వొంట్లో ఉండే రోగం అప్పుటికప్పుడు మానిపోయినట్టు తేలిగ్గా వుండాది. ఇప్పుడు నాపెళ్ళాం యాడికి బోతింది, ఎవుర్తో తిరిగితిందో జూస్తానేనెన్ని దినాలు బతికితే అన్ని దినాలు అది గూడా నాతో వుంటింది. నేను సస్తే నాతోగూడా సస్తింది. పిల్లోడిని  వోల్లవ్వ మొగోన్ని జేస్తిందిఅనుకుంటా వుండాడు. ఇన్నిదినాలూ వోడికుండే రోగాన్ని దాసిపెట్టుకొన్నోడు ఇప్పుడు పెళ్ళాం కొచ్చిన రోగం గురించి తోటి ఈడోల్లందరికీ జెప్పుకుంటా వుండాడు.
శెప్తేనే గదా పెళ్ళాం గురించి అందురికీ తెల్సేదిఎవురూ దాని జోలికి రాకుండా వుండేది! అది సచ్చిపోయినా, పిచ్చిదై పొయ్ నా సరేదానికి నా తర్వాత, నేను లేని బతుకక్కరలేదు.

    
మీ మాటలు
1.    Sayilakshmi says:
సారంగకు, ఝాన్సీ గారికి,
అనేక రకముల మాండలీకములలో కధలు ప్రచురిస్తున్నారు, వ్రాస్తున్నారు. ఎవరు చదవటానికి? తెలుగు రాని వారు అంటే చదువుకోని వారు మాండలికములో చదువుతారా! చదవగలరా! తెలుగును పెంపొందించండి అని అంటూ మాండలికం నేర్చుకోవాలా? ‘దేశ భాష లందు తెలుగు లెస్సఅన్న నానుడిని దేశ భాషలందు తెలుగు తెగులు లెస్సయని వ్రాయాలేమో!
పాఠశాల చదువులతో చక్కటి తెలుగు మాట్లాడు తున్నామని గర్విం చాలే కానీ నా పల్లె, నా ఊరు, నా వృత్తి అంటూ మాండలికానికి అక్షర రూపము ఇవ్వాలా ! దాని వలన ప్రయోజనము ఉందా! భాష మనిషిని బట్టి , ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు జనావళి సంభాషణలలో ఉన్నప్పటికి ఒక పద్ధతిలో పుస్తక బాషను పాఠ శాలలలో ప్రవేశపెట్టారు. ఆ భాషను గౌరవిస్తూ భావానికి అక్షర రూపము ఇవ్వాలి కదా! కొన్ని ఏండ్ల క్రితము ఉన్న పుస్తక (తెలుగు పండితుల బాష ) సామాన్యుడికి చదవటానికి అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ రోజుల్లో ఈ తరము వారికి కనీసపు తెలుగు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇంక చదవడము సరేసరి. అటువంటప్పుడు చిత్తూరు బాష, సింగరాయకొండ భాష అంటూ వ్రాయాలా? ప్రతివారు చదివేటట్లు ఉండాలి కానీ ఎదో కొత్త బాష గా ఉండ కూడదు. ప్రకృతి వికృతి గా మారినపుడు సరిదిద్దాలి కదా! కాదు ఆ వెల్లువ లో కొట్టుకు కు పోవాలా?
కత్తివ్రాసిన సినిమా విమర్శ విదేశి రంపపు మొనలతో నిండి ఉంది. తెలుగులో ఇంగ్లీషు, హింది, Urdu కలిపి
మాట్లాడితే, వ్రాస్తే తెలుగు తల్లి ఏడవదా? మా తెలుగు తల్లికి మల్లె పూదండ …………
ఝాన్సీ వ్రాసిన కధ సామాన్యముగా ఉంది. మాండలికం తప్పితే.
మనస్సు కష్ట పెట్టుకోకండి. ఆలోచించి …….. చించి పార వేయకండి……. “సాయిలక్ష్మి
సాయి లక్షి గారు,
ప్రామాణికమనుకుంటున్న వ్యావహారికతెలుగులో రాస్తే సౌలభ్యంగా ఉంటుంది అనేది అంగీకరించదగ్గ ప్రతిపాదనే అయినా, ‘ఇది మా వ్యావహారికంఅనే అస్తిత్వ ఉద్యమాల నేపధ్యంలో విబేధించదగ్గది కూడా అనే నిజాన్ని గుర్తించడం అవసరం. వాదాలు,ఉద్యమాల సంగతి పక్కనపెడితే కథలోని విషయం, భాషని ఎన్నుకుంటుంది అనే సాధారణ ప్రాతిపదికని ఈ కథని చుద్దాం. ఒక గ్రామీణ మహిళ తన గోడు చెప్పుకుంటున్న విధానంలో ఉన్న నెరెటివ్ లో నాగరీకమైనభాషా ప్రయోగం యొక్క ఔచిత్యం ఎంత వరకూ ఉంటుంది? భాషని సంస్కరించుకుంటూ పోతే భావహననం కాదా?. ఇక్కడ రచయిత్రి ఉద్దేశం నిజాయితీగా వ్యక్తీకరించడం. అదే కథలో ఉన్న బలం. మీరు చాలా సాధారణం అనుకుంటున్న కథ ప్రాముఖ్యత సంతరించుకునేది అక్కడే. నామిని అయినా, ఝాన్సీ తమ ప్రత్యేకత చాటుకునేది అక్కడే.
ఇక నేను రాసిన వ్యాసంలో ఇంగ్లీషు పదాల గుప్పించడం నేను మాట్లాడుతున్నట్టు రాయడమే తప్ప, నా ఆంగ్లభాషా పాండిత్యం చూపించడానికైతే కాదు. ఎందుకంటే ఆ శైలి చైతన్యస్రవంతికి దగ్గరగా ఉన్న శైలి. ర్యాంబ్లింగ్స్ లాగా ఉంటుంది. నా ర్యాంబ్లింగ్స్(వాగుడు) కొంచెం ఇంగ్లీషు, హిందీ, తెలుగు (వీలైతే తమిళం, కన్నడం,మళయాళం, బెంగాలీ కూడా) కలగలిపే ఉంటుంది. నా బలహీనత అది.
గ్రామీణ మహిళల్లో ఎయిడ్స్ బారిన పడటానికున్న ముఖ్యమైన కారణాలలో భర్త విచ్చలవిడితనం, తాగుడు అనేది ఎన్నో సర్వేలు తెలిపిన నిజం. ఆ నిజాల్ని, స్త్రీల వల్నరబిలిటీనీ ఒక నెరెటివ్ కథరూపంలో, ఒరిజినల్ మాండలీకంలో బలంగా చెప్పిన కథ ఇది. అమాయకమైన మనసుల్ని తెలిపే కథలు మనసుభాషలో ఉంటేనే బాగుంటాయి. సాఫీగా చదవడానికి కొంత మాండలికం ఇబ్బంది కలిగించినా, ఒక గ్రామీణ స్త్రీ తన గోడు చెప్పుకుంటున్నదనే స్పృహతో ఓపికచేస్తే అద్భుతమైన కథనం అనిపించే కథ ఇది.
3.    Prasad says:
ఝాసి గారికి .. చాలా థాంక్స్ చిన్నపటి మా ఊరికి వెళ్లి వచినట్టు వుంది మే కథ చదివిన తరువాత.