Tuesday, January 6, 2009

నా బంగారు యాడుందో?

నన్నెందుకు మాలోడిగా పుట్టించావురా ఎంకన్నా??

థూ...నీ బతుకు చెడ..నాలుగచ్చరాలు సమంగా రాయలేని నా కొడుకులంతా పెద్ద పెద్ద రిపోర్టర్లయిపోతా వుంటే కథలు కూడా యెడం చేత్తో రాసిపారేశే నాకు ఎవడూ ఉద్యోగమీడే. నెలకు కనీసం ఐదువేలు సంపాయిస్తే కానీ నా పెళ్ళాన్ని నా దగ్గరకు పంపరంట...ఇదొక పనికిమాలిన పోలీసోడి పంచాయితీ..నాకు ఉద్యోగమొచ్చేదెప్పుడో, నా పెళ్ళాంతో నేను కాపురం చేసేదెప్పుడో.....

****************************

నా పెళ్ళాం...దానికి 17 యేళ్ళుకూడ ఇంకా పూర్తికాలా..

నాకెంతను కుంటున్నారు?? 20యేళ్ళు..

నేనో పత్రికాఫీసులో నెలకు ఆరేడువందలిచ్చే పని చేసుకుంటున్నా...సమచ్చరం కిందటి మాట ఇది..

ఒకరోజు నైట్ డూటీలో ఉండా నేను..ఫోనొచ్చింది...

ఎవురో ఒక బిడ్డె ఆపక్కన్నుండి 'అలో..' అంటావుంది.
ఏమైనా వార్తలు శెప్తాదేమోనని పెన్ను, పేపరు రెడీగా పట్టుకోని...'శెప్పండి మేడం' అనెన్నా.
' లతక్కుందా?' అనెడిగింది.
'లేదు ' అంజెప్పినా.
' ఇయ్యండి..ప్లీజ్ ' అనింది.

నాకెందుకో ఆబిడ్డె గొంతింటావుంటే భలే వుంది.

' నువ్వౌరు? యాడ్నించి ' అనడిగినా

' కరీం నగర్ నించి ఉష మాట్లాడతావున్నా.. ఎస్టీడీ..బిల్లైపోతా వుంది...అర్జెంటుగా పిలస్తారా ' అనింది.

కొంతసేపు ఏదేదో మాట్టాడి ..తప్పునెంబరుకు ఫోన్ జేసినావమ్మీ అనిజెప్పి ఫోన్ పెట్టేశినా.
ఈలోపలే నాపేరు, నావూరు, నా సంగతులన్నీ కనిపేట్టేసింది....తెలివైందే.

మరసరోజు మళ్ళీ ఫోనొచ్చింది. ఆబిడ్డే...కానీ ఈ సారి రాంగ్ నెంబరు కాదు....నాకోసమే చేసింది. ఆరోజు మొదులుకోని రోజూ నేను నైట్ డూటీలే..ఎవుర్రాకపోయినా మా మేడం నడిగి నాకే నైట్ డూటీ ఏయమని చెప్తా వుణ్ణా..
సమచ్చరం రోజులు మాట్లాడుకున్నామట్ట.

ఒకరోజు ఫోన్ చేసి 'నేను నిన్ను చూడాల...నీతోనే వుండిపోవాల...నిన్ను పెండ్లి చేసుకోవాల అని ' ఒకటే ఏడుపు మొదలుబెట్టేసింది.
నాకు కాళ్ళు, చేతులు ఆడలా...ఏం జెయ్యాల్రా దేవుడా! అని ఒకటే దిగులైపోయె.

సరే! ఏదైతే అదైంది..ఆడబిడ్డ నన్ను నమ్మతావుంది..నాకొచ్చే ఆరునూర్లు సరిపోకుంటె ఇంకేదైనా పనిజేస్తా..ఏమీ దొరక్కుంటే మావూరికి బొయ్యి కూలినాలి జేసుకునైనా సాకేస్తా..అని మనసు దిటవుజేసుకునేసినా.

మల్లీ ఫోనొచ్చినప్పుడు ఆయమ్మికి జెప్పేసినా...' నేను పేదోడ్ని...మాలోడ్ని..గుడిసింట్లో ఐనా భద్రంగా జూసుకుంటా..నన్ను నమ్మి నువ్వొచ్చినాక నిన్ను ఏమారిచ్చను ' అని.

' నువ్వుంటే సాలు నాకు ' అనింది.

రెండ్రోజుల్లోనే తిరప్తిలో రైలు దిగేసింది.
ఆయమ్మి చందమామ మాదిరి ఉంది. తెలిసినన్న ఒకాయనతో సంగతి చెప్పి గుళ్ళో పెండ్లి చేసుకునేసినాం.
మూడు నాలుగు రోజులు ఆయమ్మికి నేను, నాకు ఆయమ్మి తప్ప ఇంకౌరూ కనిపీలా.. చిన్నగా మాయమ్మకు, మా చెల్లికి విషయం చెప్పినా...మాయమ్మ ఏడ్సింది. ఉండేది ఒక్కొడుకు...నువ్వు ఇట్టజేస్తే ఎట్టరా నాయనా! అని.

వూరికి దూరంగా ఉండే మా మాలపల్లికి ఇద్దురూ పోయినాము. కొంచేపు ఎవుర్తో మాట్టాడకుండా దొంగచూపులు చూస్తా కుచ్చున్నాం. కొంచెం సేపటికి అంతా ఒకటైపోయినాం. ఈ మాలపల్లెలో ఇంతకంటే బాగుండే బిడ్డె నీకు దొరకదు లేరా అని మాయవ్వ నెటికలు ఇరస్తా ఉంటే...గుండెనిండా ధైర్యం వొచ్చేసింది.

పదైదు రోజులు ఎట్టా అయిపోయినాయో తెలీలేదు. అప్పుడొచ్చినాడు పోలీసోడు మా ఇంటికి. కూడ ఇంగిద్దురు...నాకు సడ్డుగుడు...మామ.

నాకు పెండ్లి జేసిన అన్నను లోపలేసి బాగ కుమ్మేసినారంట...నాకోసం వొచ్చినారు. మైనరమ్మాయిని ఏమారిచ్చి పెండ్లి జేసుకుంటావురా ...మాల..ల..కొడకా....అంటూ తిట్లందుకున్నారు వొచ్చినోళ్ళిద్దురూ.

నాకు పత్రికలో ఉద్యోగముంది కాబట్టి కొట్టకుండా పోలీసు స్టేషనుకు పిల్చుకోని పోయినారు...

ఆ అమ్మాయిని వాల్లింటికి పంపెయ్యమన్నారు.

సార్!..మేమిద్దురూ పెండ్లి జేసుకున్నాం సార్..అన్నా

'నీకే రూపాయి సంపాదన లేదు.ఆ అమ్మాయిని ఎట్ట సాకతావు...కేసైతే నిన్ను లోపలెయ్యాలి. కిడ్నాపు కేసవుతుంది. ఒకపని చెయ్యి. ఆ అమ్మాయిని మేజరయ్యేదాక మేము ఎక్కడైనా పెట్టి సదివిస్తాము. మళ్ళి మేమే నీ దగ్గరకు పంపిస్తాము..దానికి వొప్పుకోని సంతకం చెయ్యి...ఈ కాయితాల్లో ' అన్నాడు ఎస్సై . నా పెండ్లాం కల్ల జూసినా...ఒకటే ఏడస్తావుంది..నేను పోను అని.
ఎస్సై కల్లా జూసినా...నాదీ పూచీ అంటాండాడు.

నెలకు ఐదువేలు సంపారిచ్చు...నీ పెల్లాం మేజరయితింది...పువ్వుల్లోపెట్టి నీకు అప్పగిస్తాం అన్నాడు.

మళ్ళీ దేవుడిమీద భారమేసినా..

అందురూ పోయినారు. నా గుడిసెనీ...గుండెనీ ఖాళీ చేసి.

అప్పట్నుంచీ ఐదువేల ఉద్యోగం కోసం ఎతకతా ఉండా రోజూ...

ఈరోజు బెంగుళూరు మెట్రోలో ఉద్యోగమిప్పిస్తానని తెలిసినోళ్ళు ఎవురో చెప్తే పోవాలని బయల్దేరినా..ఇదైనా వొస్తుందో...లేదో!

ఆలోచిస్తా ఉంటే బస్సొచ్చేసింది..

***************************

సాయంత్రానికల్లా..ఉద్యోగ మొచ్చేసింది.

నేరుగా ఎస్సై దగ్గరికి పొయ్యి సంగతి చెప్పినా..

' వెరీ గుడ్ ' అన్నాడు.

రెండ్రోజుల్లోనే ఉద్యోగంలో చేరిపోయినా...నడుమిరిగేంత పని...ఉష నా దగ్గరకొచ్చేస్తే నా కంతే చాలు...ఎక్కడుందో...ఏం చేస్తావుందో...నా దగ్గరనుంచి వెల్లిపోయాక ఒకసారి మాత్రమే ఫోన్ చేసింది.. మాట్లాడినంత సేపూ ఏడుపే..' నా బంగారూ...నువ్వు నా దగ్గరకొచ్చేస్తే నీ కంట్లో కన్నీరనేదే లేకుండా మంత్రమేసెయ్యనూ' ...నా దగ్గర లేని నా సగభాగం గురించే నా ఆలోచనంతా..

మూడు నెలలు ఐనాక..మల్లీ స్టేషనుకు పోయినా.. ఎస్సై ట్రాన్స్ ఫరై వెల్లిపోయినాడంట..

కొత్త ఎస్సై ని అడిగితే విషయం నాకు తెలీదమ్మా అన్నాడు. పాత ఎస్సై నెంబరు కనుక్కోని ఫోన్ చేస్తే ... ' ఆ అమ్మాయిని వాల్లోళ్ళు తీసుకోని పోయినారని చెప్పి ఫోన్ పెట్టేసినాడు.

గుండె పగిలేలా ఏడ్చాను..వాళ్ళూరికి వెళ్ళి తనిచ్చిన అడ్రసు లో ఎతికితే ఎవరూ లేరన్నారు.
ఇంత మోసమా...ఇంకో మూడు నెల్లు కన్నీళ్ళలో కాలం కరిగించాను.
అందరూ మర్చిపోమన్నారు...కొందరు మరుగ్గా నవ్వుకున్నారు.
ఇంకొందరు...వీడిక్కావల్సిందే...అప్పుడే పెళ్ళి కావాలా? వెక్కిరించారు.

ఇప్పుడు నేనే ఉద్యోగమూ చేయడం లేదు. కథలు రాసినా...కవితలు రాసినా ఓడిన నా ప్రేమే అందులో..

శరీరాలూ, మనసులూ కలబోసుకున్నాం...ఎన్నో ఊసులాడుకున్నాం...బాసలు చేసుకున్నాం...కట్టె కాలేదాకా ఆ పదైదు రోజుల పరిమళం నన్నొదుల్తుందా?
నేనే ఇంత అల్లాడిపోతా వుంటే నా బంగారు ఎట్టుందో? అసలుందో? లేదో?

కనపడని కన్నీటి పొర జీవితానికి అద్దుకుని గాలిపటంలా తిరుగుతున్నా నా మాల పల్లెలో...నా బంగారు తో గడిపిన నా చిన్ని గుడిసెలో..

Monday, January 5, 2009

జనవరి పస్టు ఎన్నో తేదీ వొస్తిందో !!

వాగుడు కాయలందరికీ మనస్కారం...కొత్త సమత్సరంలో ఎరైటీగా...

మా వూళ్ళో నన్ను సిన్నప్పట్నుండి పెంచిన 'పాపులమ్మ ' ఉంది.
ఆమెను అమ్మ అంటే శానా కుశాల ... మల్లీ పాపులమ్మ అంటే కోపమొచ్చేస్తింది.
ఆమెకు సదువు రాదు కాబట్టి ఇక్కడ పాపులమ్మ ఆనేశినా నాకేం బాదలేదు.

అందురూ న్యూఇయర్ కు రెడీ అయిపోతావుంటే నా దగ్గరికొచ్చింది.
" ఒరే జనవరి పస్టు ఎన్నో తేదీ వొస్తిందొ చెప్తే అంగిడి సామాన్లు శానా తెచ్చుకుంటా సంత నించి " అడిగింది.

ఈ అమాయకత్వం ఇంకా పల్లెల్లో ఉంది కాబట్టే పల్లె కంత అందం..సొగసు.