Thursday, July 14, 2011

యాడుండావు కల్యాణీ?


ఆడది ఎవురూ తోడు లేకండా బతకలేదని, మొగేసం కట్టి మొగోడిలా బతకమని మీయవ్వ నీకు శెప్పింది నిజిమేనేమో! అవ్వ సచ్చిపొయ్యేదాక నువ్వెట్టా పెరిగినావోగానీ... నువ్వు రేణిగుంట నించి తిరపతికి వొచ్చినాక, కస్టంలో నిన్ను వొదిలేశినానని నాకు ఈ రోజుగ్గూడా ఎంత బాధో తెలుసునా? కల్యాణ్ అని పేరు నువ్వే పెట్టుకోని, గాంధీరోడ్డు సందులో పాతగుడ్డలు కొనుక్కోని, మగోడిగా మారి ఐదేండ్లు ఐనా ఎవురూ కనుక్కోలేదని యిని నాకెంత కుశాలైందో తెలుసునా. నీకు జుట్టు కత్తిరించే మంగలోడికిగూడా నువ్వు ఆడదో, మొగోడో తెలీదని నువ్వు శెప్తా ఉంటే నీ తెలివికి నా నోరు తెరసక పోయింది గదా.


నేను తిరప్తిలో పని చేసేటప్పుడు విజీలచ్మి నిన్ను తొడుకోని నా దగ్గిరికి వొచ్చిన్రోజు నాకింకా గుర్తుండాది. నన్నెదుక్కుంటా వచ్హిన బంగారట్టా బిడ్డెను మల్లీ గాలికొదిలేస్తిమే అని మనేదే నాకీరోజుగ్గూడా. తిరప్తి రైలుటేసను కాడ రోడ్లో ఉండే 'మందు ' అంగిడిలో నువ్వు పంజేస్తావని చెప్తే అప్పుడేగదా నేను నిన్ను జూసింది! నిజిం జెప్తా జూడు. తొల్తలో నేను గూడా నిన్ను మొగపిల్లోడనే అనుకునేసినా.

వొల్లంతా దెబ్బలు తగిలిచ్హుకోని, రక్తం కారతా ఉంటే...ఏమైందని అడిగితే విజీలచ్మి ఏం జెప్పింది?
మందంగిడి ఓనరు కొడుకు, ముందురోజు రాత్రి నిన్ను చెయ్యిబట్టుకోని లాగి, నిన్ను చెరచాలనుకున్నాడని, నువ్వు పరిగిత్తాఉంటే రాయితో ఇసిరేసినాడని, కమ్మితో కొట్నాడని, నువ్వు రాత్రంతా ఎట్టోకట్ట దాంకోని, తెల్లారైతానే విజీలచ్మి వోల్లకు కనిపించినావని చెప్తా ఉంటే నాకు వొంట్లో రక్తమే రంగుమారి కంట్లో నించి బైటకు వొచ్చింది గదా. మగోడి మాదిరిగా నువ్వు బతకతా ఉంటేగూడ మగెదవలకి నీ ఆడ వొళ్ళు కనిపిచ్చిందంటే తప్పు ఎవురిదని అనుకోవాల.


ఆరోజు నీతో మాట్టాడేసి, నా కోప్మంతా పేపర్లో రాసేసినా గదా. నిన్ను బైటకు పంపిస్తే ఆ యెదవలు మల్లీ ఎమైనా జేస్తారని నిన్నెత్తక పోయి 'రైజ్' లో పెట్టిస్తి గదా. ఆడ వాళ్ళింట్లో పని జేయిపిస్తా ఉండారంటే గూడా నేను బాధపడ్లా. యాడో వొకచోట నెమ్మదిగా ఉందిలే అనుకుంటి. కేసులు పెట్టద్దు , డబ్బిస్తామని లాయిరు వొస్తే, నీకు న్నాయం జరగాలని పోరాడితి గదా! వినాయిక చెవితి పండగ రోజు ఆఫీసుకాడికి నువ్వు కుడుములు ఎత్తకస్తే కంట్లో నీల్లొచ్చినాయి నాకు. ఎవురీబిడ్డె? నేనంటే ఏంటికింత ఆశి? అని శానాతూర్లు నాకు కండ్లమ్మట నీళ్ళొస్తే అప్పుడప్పుడూ కొంచిం కులుగ్గాగూడా ఉణ్ణింది. నిన్ను మా ఇంటికి తొడుకోని పోయి పెట్టుకుందామంటే, నేనే ఉద్దోగంకోసం ఇంగోరి ఇంట్లో ఉండా గదా! నువ్వు అప్పుడప్పుడూ ఫోను జేసి ' అక్కా!' అని పిలస్తా వుంటే భలే కుశాలగా ఉణ్ణింది నాకు.


వొకరోజు నిన్నింట్లో పెట్టుకున్నోళ్ళొచ్హి ' కల్యాణి ' యాడకో పూడ్సిందని చెప్తే ఊపిరి నిల్చిపోయింది నాకు. యాడకు పోయింది మీకు జెప్పకుండా అంటే ' ఏమో తెలీదని ' తప్పించుకునేసిరి. యెతికి యెతికి నేనుగూడా అల్సిపోతి. యాడుండావో తెలీదు..నిన్నెట్ట ఎతకాలో తెలీదు. వోళ్ళకు నేను ముందే జెప్పిపెట్నా...ఆ బిడ్డెని ఇంట్లోనే బెట్టుకోండ..ఆస్టల్లో వొద్దని. డబ్బిస్తామనిజెప్పిన లాయిరూ, రైజోళ్ళూ ఒగిటైపోయినట్టు ఇప్పిటికీ నాకు అనిపిస్తింది. నేనొద్దన్నా నిన్ను ఎత్తకపొయ్యి జీవకోనలో ఆస్టల్లో పెట్నారా?.. ముందు నిన్ను మా ఇంట్లోనే పెట్టుకుంటానని జెప్పినోళ్ళు , నీకు శానా తెలివుందని పొగిడ్నోళ్ళు పది రోజులుగూడా కాకముందే బైటికి బంపిచేశిరా? ఆడ నేనుండనని నువ్వు ఏడిస్తేగూడా మళ్ళీ పొమ్మన్రి కదా? నిన్ను కావల్సికే పంపించేసినారేమో అనిపిస్తావుంటింది నాకు. మైనరు బిడ్డెకు జరిగిండే అన్నేయం గవుర్నరుకు తెలిసి పెద్ద కేసయ్యేటప్పటికి వోల్లంతా ఒగిటైపోయినారు కదా!


మళ్ళెప్పుడో ఒకసారి నన్నూ నిన్నూ కూడా తెల్సినోళ్ళు కనిపిచ్చి ఏంజెప్పిరో తెల్సా కల్యాణీ? తిరుగుబోతు బిడ్డెనుదెచ్చి ఇంట్లోబెడ్తే యాడుంటుంది..మళ్ళీ ఈదిలోకేబోయింది. మొన్న మేము సిన్మాకుబోతే గ్రూపు కొటాయిలకాడ బ్లాకులో టిక్కెట్లమ్మతాఉండాది. నన్నుజూసి పిలస్తావుంటే పరిగెత్తిపొయ్యింది అని. అది ఇంటానే నేను మళ్ళీ కొటాయిలకాడ ఎతికిచ్చినా నీ కోసరం. నువ్వు కనిపీలా నాకు. ఇప్పిటికీ తిరప్తికి వస్తే, ఎవురన్నా ఈదుల్లో తిరిగే పిలకాయిలు కనిపిస్తే నువ్వుండావేమో అని రెండుతూర్లు వాల్లకల్లా జూస్తా. ఈసారి ఎప్పుడైనా కనిపించినావనుకో! మళ్ళీ వొదల్ను నిన్ను.


నీ కస్టమేందో నాకు జెప్పుకో. నువ్వెందుకు మళ్ళీ బైటకు పొయ్యినావో నన్నుగూడా ఇన్నీ. నేనోడిపొయ్యినానో, అందురూ కలిసి నిన్నోడిచ్చినారో మాట్లాడుకుందాం. మల్లీ నా కంట్లో నీళ్ళొచ్చేదాకా ' అక్కా! ' అని పిలువ్. నాతో వొచ్చెయ్. నా గుండెలోనే కాదు, నీ కిప్పుడు మాఇంట్లో గూడా తావుండాది. కస్టాలుబెట్టే రోడ్లు, రైలుటేసన్లు నీకొద్దు. నిన్నుజూసి పదేండ్లయినా కండ్లల్లోనే మెదల్తా ఉండావు. పది, పన్నెండేండ్లకే నిన్ను వొదల్లేదే... ఇప్పుడేమైపోయినావో అని గుండె గభీమంటాది నాకు.


తిరుగుబోతు పిలకాయిలు ఇంట్లో ఉండాలంటే వోళ్ళకు మన గుండెలో తావీయాలని మనిద్దరం అందురికీ చెప్దాం కల్యాణీ! వొచ్చెయ్ నా దగ్గిరికి.