Tuesday, September 30, 2008

పెళ్ళయితానే బిడ్డపుట్టిపోవాలంటే అయితాదా?

బోడిగుండ్లకు పేరుమోసిన తిరపతిలో జరిగిన కామెడీ ఇది.
అక్కడ మహిళాసంఘాలు చాలా బలంగా ఉంటాయి.
ఈ సంగతి బాగా తెలిసినా తిరపతి ఎమ్మెల్యేగారు అప్పుడప్పుడూ నోరు జారుతుంటారు...నాలుక్కరుచుకుంటారు.

ఆమధ్య ఒక శుభదినం రేణిగుంటలో మహిళాసంఘాల మీటింగు జరిగింది. మీటింగు ప్రారంభమైన క్షణం నుంచే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి,లోన్ల గురించి సదరు మహిళామణులు ఎమ్మెల్యేను నిలదీయడం మొదలుపెట్టారు.
ఒక మహిళాశిరోమణి లేచింది.
' సార్! మాకు ఇళ్ళు కట్టుకునేదానికి లోన్లు ఎప్పుడిస్తారు సార్? సగం ఇళ్ళు కట్టుకోని బిల్లులు రాక, అప్పులు చేసుకోని అవస్తలు పడ్తుండాము. ఎప్పుడు ఆఫీసర్లను అడిగినా...ఇదో ఇస్తాండాము......అద్దో ఇస్తాండాము అని చేప్తారే గానీ చేసిందేమో లేదు.' గోడు వెళ్ళగక్కింది.
' సోనియాగాంధీ గారు....' అంటూ ఏదో చెప్పబోతున్న ఎమ్మెల్యేగారు ఆగిపోయారు.
'కూర్చోమ్మా...అందరికీ ఇండ్లొస్తాయి...కొంచెం ఓపికపడ్తే కదా!' ఓదార్చబోయారు.
'ఏంది సార్! ఓపికపట్టేది? ఎన్నిరోజుల్నించి అడగతాంటే కూడా ఎవురూ సమధానం చెప్పరు. పనులు వొదులుకోని ఆఫీసుల చుట్టూ తిరిగేటట్టయిపోతోంది రోజూ....పనులు చెయ్యకపోయినా మీటింగులకు మాత్రం కరెక్టుగా రావాల...' ఇంకొంతమంది సబలలు పైకిలేచారు కోపంగా.

సోనియాగాంధీగారి గురించి, తమ ప్రభుత్వం గొప్పదనం గురించి ఏదేదో చెప్పలనుకున్న సదరు ఎమ్మెల్యేకి కూడా కోపం వచ్చేసింది.నన్నే మాట్లాడనీకుండా ఆపేస్తారా? చూస్తా వీళ్ళసంగతి...అనుకున్నారు మనసులో. పైకి మాత్రం
' ప్రాసెస్ లో ఉందమ్మా..కొంతసేపు వెయిట్ చెయ్యాల...' మళ్ళీ వోదార్చారు...ఈసారి కాస్త కరుగ్గా..

' ఎప్పుడుసార్! డబ్బిచ్చేది? చెప్పిందే చెప్తావుంటారు..పని మాత్రం జరగదు ' ఆడోళ్ళు మళ్ళీలేచారు.

అరికాలిమంట నెత్తికెక్కింది మన ఎమ్మెల్యేగారికి.
' చూడండమ్మా! పెళ్ళయితానే బిడ్డపుట్టిపోవాలంటే అయితాదా? దానికి కొంచెం టైం పడ్తాది. తొమ్మిదినెల్లు మొయ్యాల కడుపులో..ఇంకొంతమందికి ఇంకా లేటవుతాది...వోపికుండాల...దేనికైనా...కూచ్చోండి ' మహిళలకు బాగా అర్తమయ్యేటట్లు చెప్పాననే ఆయన అనుకున్నారు.
' ఇక మీటింగు మొదలు పెడదాం...' అన్నారు.
ఆయన ఏం చెప్పారో అప్పటికి అర్థమైంది...ఆడోళ్ళందరికీ. అక్కడున్న మహిళా అధికారులకు కూడా..

తరువాత ఏమైందో చెప్పనవసరం లేదనుకుంటా...!
' మీటింగులో బూతులు మాట్లాడ్తావా? డబ్బుగురించి అడిగితే కడుపులో బిడ్డగురించి మాట్లాడ్తావా?? ' అని..ఒకటే రగడ.ఎమ్మెల్యే గారికి దిమ్మదిరిగి 'సారీ!' చెప్పేవరకు వాళ్ళుగాని వదిలిపెట్టుంటే వొట్టు.

'ఏందబ్బా! నేనేం బూతులు మాట్టాడ్నా?యాడన్నా స్కూలుకన్నా బోవల్ల...మాట్టాడేది నేర్చుకునేదానికి ' అందరితో వాపోతున్న ఎమ్మెల్యేకి ఇప్పటికీ అర్థంకావడం లేదు...తానేం నోరుజారాడో... :)

Friday, September 26, 2008

ఇంకో పెళ్ళాం కాడికి పోయినాడు సార్......!

నేనప్పుడు జర్నలిస్టుని.

తిరుపతిలో ఆంధ్రజ్యోతి పత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. మన నారా చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రి.
చిత్తూరు జిల్లా లోని ఒక మారుమూల ప్రాంతంలో 'జన్మభూమి ' సభ ఏర్పాటు చేశారు. తంబళ్ళపల్లె నియోజకవర్గం లో అనుకుంటా . కవరేజి కోసం నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఏర్పాట్లు భారీగానే జరిగాయి.

కార్యక్రమంలో భాగంగా బడి మానేసిన పిల్లల్ని కూడా వేదిక సమీపంలో కూర్చోపెట్టారు.
బాబుగారు వచ్చారు. కార్యక్రమం ప్రారంభమైంది.

పన్నెండేళ్ళ చిన్నోడొకడ్ని వేదిక మీదకు పిలిచారు.

'నీ పేరేంటి ?' అడిగారు.
' మాధవయ్య ' చెప్పాడా చిన్నోడు.
' వెరీగుడ్. స్కూలుకు వెళ్తున్నావా ' మరోప్రశ్న.

' లేదు సా ' సమాధానం.
' ఏం? ఎందుకెళ్ళడం లేదు? ' బాబుగారికి కొద్దిగా కోపమొచ్చింది ఈసారి.
' పనికి పోతాండాను సా..'
' ఏం పనికి?' అధికారులను కాస్త కోపంగా చూస్తున్నారు సి.ఎం గారు.
' ఆవుల్తోలుకోని పోతాన్సా...కొండమిందికి. వచ్చినంక పాలు పిండి సెంటరులో పోస్తాను సా..' జనాలను, మొహం మీదకు వస్తున్న మీడియా కెమెరాలను చూస్తూ బెరుగ్గా సమాధానమిచ్చాడు .

' మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? '
' మా నాయన ఏమీ చేయడు సా...మాయమ్మ వంట చేస్తుంది సా'

' నువ్వు పని మానేసి స్కూలుకు వెళ్ళాలి...సరేనా! ఏమయ్యా ఈ కుర్రాడిని స్కూలుకు పంపండి. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి ' ఎం.ఇ.వో కు ఆదేశాలు జారీ చేశారు.
'ఇప్పటికి చాలాసార్లు మాట్లాడాం సార్ ..పని మానేసి బడికెళ్తే తిండెలా? అంటున్నాడు సార్ వీళ్ళ నాన్న' చెప్పాడు ఎం.ఇ.వో

' ఏం బాబూ నీకు చదువుకోవడం ఇష్టమేనా?' మరోసారి కుర్రాడ్ని రెట్టించారు బాబుగారు.
' ఇష్టమే సా..కానీ మా నాయిన తిడ్తాడు సా...'
' నేను మట్లాడ్తాను మీ నాన్నతో..ఏం పేరు మీ నాన్న పేరు ' దర్పంగా ప్రశ్నించారు.
' మహదేవయ్య సా '
' మహదేవయ్య ఒకసారి వేదిక మీదకు రావాలి..' పిలుస్తున్నారు నాయుడుగారు.

నాలుగైదు సార్లు పిలిచినా ఆయన వేదిక మీదకు రాలేదు. 'భయపడినట్టున్నాడు.తరువాత మీరు పిలిచి మాట్లాడండి ' అని జిల్లా కలెక్టర్ రావంత్ గారిని ఆదేశించారు సి.ఎం .

ఇదంతా వింటున్న మాధవయ్య...' మా నాయిన మీటింగుకు రాలెదు సా...' అని చెప్పాడు.
' అవునా..! ఊర్లోలేడా? ఎక్కడికెళ్ళాడు? ఇక్కడ ఇంతపెద్ద మీటింగు జరుగుతావుంటే..." నవ్వుతూ అడిగారు చంద్రబాబు.

' ఇంకో పెళ్ళాం కాడికి పోయినాడు సా..' నిజం చెప్పేశాడు కొన్ని వేలమంది జనం ముందు.


విన్నవెంటనే గతుక్కుమన్నా అందరితోపాటే గట్టిగా నవ్వేశారు మన చంద్రబాబు నాయుడు గారు. 'పిల్లవాడ్ని చదివించడం కంటే ఆయనకు ఇది ఇంపార్టెంటు..పనిచేసి పిల్లోడు సంపాదిస్తే వాళ్ళ నాయిన ఇంకో రెండు ఫ్యామిలీలు పెడ్తాడు. ఈ పిల్లోడ్ని రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించండి....వెంటనే' సభను ముగించేశారు.

మరుసటిరోజు అన్ని పత్రికల్లోనూ మాధవయ్యే హీరో...
కానీ మనమెప్పుడు మారుదాం???


Wednesday, September 24, 2008

పేకముక్కలు-పిచ్చిఆకులు :)

గవర్నమెంటు ముళ్ళచెట్ల గురించి విన్నారా మీరు?
వంటచెరుకు కోసం ప్రతి ఊళ్ళోనూ గవర్నమెంటు నాటించిందిలే ఒకప్పుడు.
పొయ్యిలో పెట్టుకోవడానికే కాదు...అమ్మానాన్నల తిట్లు,దెబ్బల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ చెట్లు పనికొస్తాయి.

సిటీల్లో పెరిగేవారికి ఇది కొత్తగా కనిపించొచ్చు. కానీ పల్లెల్లో పెరిగిన వాళ్ళకు ఈ చెట్టు గురించి, వాటి ఆకుల గురించి బాగానే తెలుసు. గవర్నమెంటు ముళ్ళచెట్టు చిగుళ్ళను కొంచెం తుంచి ...ఆడవాళ్ళయితే జుట్టులో, మగవాళ్ళయితే జేబులో పెట్టుకుంటే ఎలాంటి దూషణలూ, తన్నులూ దగ్గరకు రావని, కష్టాలన్నీ బైపాస్ లో వెళ్ళిపోతాయనీ చిన్నప్పుడు నాకు బాగా తెలుసు. చాలాసార్లు వర్కౌట్ అయ్యింది కూడా.

దొంగపనులు చేసినా, ఎక్కువగా నవ్వేసినా (ఎక్కువ నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడంటున్నారు కానీ, అప్పట్లో ఎంత ఎక్కువగా నవ్వితే తరువాత అంత ఎక్కువ ఏడుస్తారని అనేవారు) ఈ ఆకుల్నే ఆశ్రయించడం నాకు అలవాటు.

నేను మూడో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా...ఈ సంఘటన జరిగింది.

మా నాన్న యమస్ట్రిక్టు...కోపమొస్తే బెల్టుతో వీపు చీరేసేవాడు. నాన్న కొలీగ్ ఒకాయన ఉండేవారు. నరసింగరావు అనుకుంటా ఆయన పేరు. ఆయనకు నలుగురు పిల్లలు. మేమూ అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం.
ఆరోజు కూడా నేను, మా తమ్ముడు వాళ్ళింటికి వెళ్ళాం. వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు. మేము వెళ్ళేసరికి పేకాట ఆడుతున్నారు. కాసేపు వాళ్ళ పక్కనే కూర్చుని చూశాం. మా తమ్ముడు నాకంటే రెండేళ్ళు చిన్నవాడు. చిన్నప్పుడే ఏదేదో చేసేయాలనే టైపు. ఒక అన్న పక్కన కూర్చుని పేకముక్కలు ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పేకముక్కలు చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. మా ఖర్మ కాలి....అదే సమయానికి మా నాన్న మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేశాడు.


వీధి గుమ్మం కర్టెన్ తీయగానే ఎదురుగా మేమిద్దరం...
ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు కానీ...ఆయన కళ్ళల్లో కోపం మాకు అర్థమైపోయింది.


ఇంటికి వెళ్ళాలి... వెళ్ళాలంటే భయం.
కళ్ళు మూసినా...తెరిచినా ఎదురుగా బెల్టే కనిపిస్తోంది.
ఇంటికి బయల్దేరాం...భయం భయంగా...
అప్పుడు...సడన్ గా నాకు గవర్నమెంటు చెట్టు గుర్తొచ్చేసింది. గబగబా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి పోయి ఆకులు తెంపి కొంచెం నేను జడలో పెట్టుకున్నా...అప్పటికి సగం భయం తగ్గిపోయింది. ఇంకొంచెం బాబుకు(తమ్ముడికి) ఇచ్చా. ఎందుకని అడిగితే ఆకుల మహత్యాన్ని వివరించా..

ఇద్దరికీ ధైర్యం వచ్చేసింది...బోలెడంత.మనల్ని ఇంక ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా.
ఇంట్లోకి వెళ్ళాం..నాన్న కోపంగా కూర్చుని ఉన్నాడు.

'అప్పుడే కాయితాలు కావాల్సి వచ్చాయా మీకు?'....ఉరిమాడు.
ఆకులు పనిచేయడంలేదా!...ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాం అనుమానంగా.
బిక్కుబిక్కు మంటూ నాన్నకల్లా చూశాం...


తరువాత జరిగింది చెప్పఖ్ఖరలేదనుకుంటా...
దుమ్ముదులిపేశాడు నాన్న...

నా జుట్టులోంచి...వాడి జేబులోంచి గవర్నమెంటు చెట్టు ఆకులు రాలి కింద పడేదాక.....:(


(ఎవరో ఏదో చెప్పారని జేబుల్లో,చెవుల్లో ఆకులు,పువ్వులు పెట్టుకోకండి.ఒకవేళ పెట్టుకున్నా ఇంకేచెట్టు ఆకుల్నైనా నమ్మండి కానీ గవర్నమెంటు చెట్లను మాత్రం నమ్మొద్దని మనవి. గవర్నమెంటు పథకాల్లాగే ఇవి కూడ ఒక్కోసారి అందరికీ వర్కవుట్ కావు.)