బోడిగుండ్లకు పేరుమోసిన తిరపతిలో జరిగిన కామెడీ ఇది.
అక్కడ మహిళాసంఘాలు చాలా బలంగా ఉంటాయి.
ఈ సంగతి బాగా తెలిసినా తిరపతి ఎమ్మెల్యేగారు అప్పుడప్పుడూ నోరు జారుతుంటారు...నాలుక్కరుచుకుంటారు.
ఆమధ్య ఒక శుభదినం రేణిగుంటలో మహిళాసంఘాల మీటింగు జరిగింది. మీటింగు ప్రారంభమైన క్షణం నుంచే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి,లోన్ల గురించి సదరు మహిళామణులు ఎమ్మెల్యేను నిలదీయడం మొదలుపెట్టారు.
ఒక మహిళాశిరోమణి లేచింది.
' సార్! మాకు ఇళ్ళు కట్టుకునేదానికి లోన్లు ఎప్పుడిస్తారు సార్? సగం ఇళ్ళు కట్టుకోని బిల్లులు రాక, అప్పులు చేసుకోని అవస్తలు పడ్తుండాము. ఎప్పుడు ఆఫీసర్లను అడిగినా...ఇదో ఇస్తాండాము......అద్దో ఇస్తాండాము అని చేప్తారే గానీ చేసిందేమో లేదు.' గోడు వెళ్ళగక్కింది.
' సోనియాగాంధీ గారు....' అంటూ ఏదో చెప్పబోతున్న ఎమ్మెల్యేగారు ఆగిపోయారు.
'కూర్చోమ్మా...అందరికీ ఇండ్లొస్తాయి...కొంచెం ఓపికపడ్తే కదా!' ఓదార్చబోయారు.
'ఏంది సార్! ఓపికపట్టేది? ఎన్నిరోజుల్నించి అడగతాంటే కూడా ఎవురూ సమధానం చెప్పరు. పనులు వొదులుకోని ఆఫీసుల చుట్టూ తిరిగేటట్టయిపోతోంది రోజూ....పనులు చెయ్యకపోయినా మీటింగులకు మాత్రం కరెక్టుగా రావాల...' ఇంకొంతమంది సబలలు పైకిలేచారు కోపంగా.
సోనియాగాంధీగారి గురించి, తమ ప్రభుత్వం గొప్పదనం గురించి ఏదేదో చెప్పలనుకున్న సదరు ఎమ్మెల్యేకి కూడా కోపం వచ్చేసింది.నన్నే మాట్లాడనీకుండా ఆపేస్తారా? చూస్తా వీళ్ళసంగతి...అనుకున్నారు మనసులో. పైకి మాత్రం
' ప్రాసెస్ లో ఉందమ్మా..కొంతసేపు వెయిట్ చెయ్యాల...' మళ్ళీ వోదార్చారు...ఈసారి కాస్త కరుగ్గా..
' ఎప్పుడుసార్! డబ్బిచ్చేది? చెప్పిందే చెప్తావుంటారు..పని మాత్రం జరగదు ' ఆడోళ్ళు మళ్ళీలేచారు.
అరికాలిమంట నెత్తికెక్కింది మన ఎమ్మెల్యేగారికి.
' చూడండమ్మా! పెళ్ళయితానే బిడ్డపుట్టిపోవాలంటే అయితాదా? దానికి కొంచెం టైం పడ్తాది. తొమ్మిదినెల్లు మొయ్యాల కడుపులో..ఇంకొంతమందికి ఇంకా లేటవుతాది...వోపికుండాల...దేనికైనా...కూచ్చోండి ' మహిళలకు బాగా అర్తమయ్యేటట్లు చెప్పాననే ఆయన అనుకున్నారు.
' ఇక మీటింగు మొదలు పెడదాం...' అన్నారు.
ఆయన ఏం చెప్పారో అప్పటికి అర్థమైంది...ఆడోళ్ళందరికీ. అక్కడున్న మహిళా అధికారులకు కూడా..
తరువాత ఏమైందో చెప్పనవసరం లేదనుకుంటా...!
' మీటింగులో బూతులు మాట్లాడ్తావా? డబ్బుగురించి అడిగితే కడుపులో బిడ్డగురించి మాట్లాడ్తావా?? ' అని..ఒకటే రగడ.ఎమ్మెల్యే గారికి దిమ్మదిరిగి 'సారీ!' చెప్పేవరకు వాళ్ళుగాని వదిలిపెట్టుంటే వొట్టు.
'ఏందబ్బా! నేనేం బూతులు మాట్టాడ్నా?యాడన్నా స్కూలుకన్నా బోవల్ల...మాట్టాడేది నేర్చుకునేదానికి ' అందరితో వాపోతున్న ఎమ్మెల్యేకి ఇప్పటికీ అర్థంకావడం లేదు...తానేం నోరుజారాడో... :)
6 comments:
ha ha ha.
మీ బ్లాగునీ బ్లాగులో ఇతర పోస్టులనీ ఇప్పుడే చూశా.
ఇలాంటి చిన్న రాజకీయ హాస్య గుళికలే గాక స్థానిక సమకాలీన సమస్యల గురించి మీదైన ఆలోచనలు పంచుకోవాలని కోరుతున్నా.
మీకు వీలుంటే నాకో ఈ మెయిలు ఇవ్వండి.
kottapali at gmail dot com
Reality is reflecting in your posts. Keep it up ...
సూపరో సూపరు! :-)))
సుపరిచితమైన చిత్తూరు యాస.
బాగుంది. మన సిత్తూరు బాసేబాస!
విషయం బావుంది. దాన్ని మించి మీరు చెప్పిన విధానం మరీ బావుంది.
hey chala baundi...
Post a Comment