Thursday, May 14, 2009

నేనూ...జార్విస్...మా వూరి మాలపల్లెలో...

"మా రాజ్యం జూసేదానికి ఆ దేశాన్నుండి ఈడికొచ్చినాడు అయ్య..." నోటికడ్డంగా చెయ్యేసుకోని అనింది వసంత పక్కింటామెతో
" తెల్లగా ఉండాడు...ఈ యెండకు మాడిపోతాడేమో"

" ఎవురు మా...ఆయన?"

మాలపల్లెలో మిట్ట మద్దేనం మాక్కనిపించింది నలుగురే ఐనా వాళ్ళ మొఖాలు నూరు ఇచ్చిత్రాలు ఒకేసారి చూసినట్టు వుండాయి.
బెంగుళూరు నుంచి మావూరుకు పొయ్యిన నాకు అమెరికా నుంచి మా వూరికొచ్చిన జార్విస్ 'నమస్కారం' చెప్పి పలకరిస్తావుంటే తొల్తలో నా మూతి కూడా అట్టే వుణ్ణిందేమో!

మా వూరు బాగుందా అనడిగితే 'బాగుంది. మీ వూర్లో గుడి, అంటరానోల్లు...' అని చెప్పినప్పుడు మాత్రం కొంచెం కోపం గూడా వొచ్చిందిలే.
మూడ్రోజులైనాక వూరు మొత్తం చూడాలంటే తొడుకోని పోయినా.

వూరైపోయినాక తిరుక్కోని వస్తా వుంటే అప్పుడెప్పుడో మా ఇంట్లో పంజేసిన వసంత కనిపించింది.

' రా యమా! బాగుండారా? ' అని పిలస్తావుంటే జార్విస్నడిగినా పోదామా అని.

అంటరానోల్ల ఇంటికి జార్విస్ ను తొడుకోని పోవాలనిపించింది.

ఎందుకంటే వూరు, మాలపల్లె కలిసే రోజొచ్చినా, ఈడ అంటరానోల్లు ఇంక వుండని రోజొచ్చినా దాన్ని జూసేదానికి జార్విస్ మళ్ళీ అమెరికా నించి వస్తాడని నాకు నమ్మకం లేదు.

'పోవచ్చా? ఆమె వొప్పుకుంటిందా?' అన్నాడు.

పోదాం రా అని పిల్చుకోని పోతావుంటే సరిగ్గా చెట్టుమీద గువ్వోటి జార్విస్ నెత్తిన పెంటేసింది.
నవ్వుకుంటా వసంత దగ్గిరికిబోయి 'పేపరోకటియ్య ' అనడిగినా
దాంతో తుడ్సుకుంటా వాళ్ళింటికాడికి పొయ్యినాం.

'మా ఇంట్లోకొస్తారా మా? యాడివాడుండాయి. మిద్దెలుజూసి మా ఇండ్లు జూస్తే ఏవుంటింది?' అంటావుంటే వసంత మొకం నాకు ఎలిగిపోతా కనిపించింది. వూర్లో వాల్లు రాకపోతే పోయిరి. ఇదేశాన్నుంచి మా యింటికి సుట్టమొచ్చేసినాడని..కుశాల గూడా..

మీ ఇల్లు సూడాలంట అంజెప్పి వొంకోని గుడిసె లోపలికి బోయినాం.

వాల్ల వొంటిల్లు, పెడి, అటక, సామాన్లు ఎత్తిపెట్టుకునే దొంతలు, వాల్ల పిల్లి 'జానీ' అన్నీ జూసి ఇల్లు శానా శుబ్రంగా వుందన్నాడు...ఆమెకో నమస్కారం జెప్పేసి.

దొంతిలో నుంచి మూడు సపోటా కాయలు ఎత్తిచ్చింది వసంత.

తిరుక్కోని ఇంటికొచ్చి మాయమ్మతో చెప్పినా...మాలపల్లికి పొయ్యొచ్చినామని.

అప్పుడు మాయమ్మ మొకం పెట్టిన తీరు జూసి జార్విస్ అన్నాడు నాతో..

వూళ్ళోవాల్లకు ఇష్టం లేదు...అందుకే మాలపల్లి దోవలో గువ్వగూడ నాపైన పెంటేసిందని...!


ఆరోజు సాయంత్రం మేం మళ్ళీ మాలపల్లికి పొయ్యొచ్చినాం...ఈసారి వీడియోగూడా తీసుకోని, పన్లో పనిగా ఇంగో రెండిండ్లు తిరుక్కోని.

మీకో ఇచిత్రం జెప్పేదా!
మా వూరి మాలపల్లికి నేనుగూడా ఆవేల్టికి ఎప్పుడూబొయ్యింది లే..
అమ్రికా ఆయన పుణ్యమాని మావోళ్ళను జూసొచ్చినా.