Wednesday, September 24, 2008

పేకముక్కలు-పిచ్చిఆకులు :)

గవర్నమెంటు ముళ్ళచెట్ల గురించి విన్నారా మీరు?
వంటచెరుకు కోసం ప్రతి ఊళ్ళోనూ గవర్నమెంటు నాటించిందిలే ఒకప్పుడు.
పొయ్యిలో పెట్టుకోవడానికే కాదు...అమ్మానాన్నల తిట్లు,దెబ్బల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ చెట్లు పనికొస్తాయి.

సిటీల్లో పెరిగేవారికి ఇది కొత్తగా కనిపించొచ్చు. కానీ పల్లెల్లో పెరిగిన వాళ్ళకు ఈ చెట్టు గురించి, వాటి ఆకుల గురించి బాగానే తెలుసు. గవర్నమెంటు ముళ్ళచెట్టు చిగుళ్ళను కొంచెం తుంచి ...ఆడవాళ్ళయితే జుట్టులో, మగవాళ్ళయితే జేబులో పెట్టుకుంటే ఎలాంటి దూషణలూ, తన్నులూ దగ్గరకు రావని, కష్టాలన్నీ బైపాస్ లో వెళ్ళిపోతాయనీ చిన్నప్పుడు నాకు బాగా తెలుసు. చాలాసార్లు వర్కౌట్ అయ్యింది కూడా.

దొంగపనులు చేసినా, ఎక్కువగా నవ్వేసినా (ఎక్కువ నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడంటున్నారు కానీ, అప్పట్లో ఎంత ఎక్కువగా నవ్వితే తరువాత అంత ఎక్కువ ఏడుస్తారని అనేవారు) ఈ ఆకుల్నే ఆశ్రయించడం నాకు అలవాటు.

నేను మూడో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా...ఈ సంఘటన జరిగింది.

మా నాన్న యమస్ట్రిక్టు...కోపమొస్తే బెల్టుతో వీపు చీరేసేవాడు. నాన్న కొలీగ్ ఒకాయన ఉండేవారు. నరసింగరావు అనుకుంటా ఆయన పేరు. ఆయనకు నలుగురు పిల్లలు. మేమూ అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం.
ఆరోజు కూడా నేను, మా తమ్ముడు వాళ్ళింటికి వెళ్ళాం. వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు. మేము వెళ్ళేసరికి పేకాట ఆడుతున్నారు. కాసేపు వాళ్ళ పక్కనే కూర్చుని చూశాం. మా తమ్ముడు నాకంటే రెండేళ్ళు చిన్నవాడు. చిన్నప్పుడే ఏదేదో చేసేయాలనే టైపు. ఒక అన్న పక్కన కూర్చుని పేకముక్కలు ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పేకముక్కలు చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. మా ఖర్మ కాలి....అదే సమయానికి మా నాన్న మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేశాడు.


వీధి గుమ్మం కర్టెన్ తీయగానే ఎదురుగా మేమిద్దరం...
ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు కానీ...ఆయన కళ్ళల్లో కోపం మాకు అర్థమైపోయింది.


ఇంటికి వెళ్ళాలి... వెళ్ళాలంటే భయం.
కళ్ళు మూసినా...తెరిచినా ఎదురుగా బెల్టే కనిపిస్తోంది.
ఇంటికి బయల్దేరాం...భయం భయంగా...
అప్పుడు...సడన్ గా నాకు గవర్నమెంటు చెట్టు గుర్తొచ్చేసింది. గబగబా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి పోయి ఆకులు తెంపి కొంచెం నేను జడలో పెట్టుకున్నా...అప్పటికి సగం భయం తగ్గిపోయింది. ఇంకొంచెం బాబుకు(తమ్ముడికి) ఇచ్చా. ఎందుకని అడిగితే ఆకుల మహత్యాన్ని వివరించా..

ఇద్దరికీ ధైర్యం వచ్చేసింది...బోలెడంత.మనల్ని ఇంక ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా.
ఇంట్లోకి వెళ్ళాం..నాన్న కోపంగా కూర్చుని ఉన్నాడు.

'అప్పుడే కాయితాలు కావాల్సి వచ్చాయా మీకు?'....ఉరిమాడు.
ఆకులు పనిచేయడంలేదా!...ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాం అనుమానంగా.
బిక్కుబిక్కు మంటూ నాన్నకల్లా చూశాం...


తరువాత జరిగింది చెప్పఖ్ఖరలేదనుకుంటా...
దుమ్ముదులిపేశాడు నాన్న...

నా జుట్టులోంచి...వాడి జేబులోంచి గవర్నమెంటు చెట్టు ఆకులు రాలి కింద పడేదాక.....:(


(ఎవరో ఏదో చెప్పారని జేబుల్లో,చెవుల్లో ఆకులు,పువ్వులు పెట్టుకోకండి.ఒకవేళ పెట్టుకున్నా ఇంకేచెట్టు ఆకుల్నైనా నమ్మండి కానీ గవర్నమెంటు చెట్లను మాత్రం నమ్మొద్దని మనవి. గవర్నమెంటు పథకాల్లాగే ఇవి కూడ ఒక్కోసారి అందరికీ వర్కవుట్ కావు.)

6 comments:

Rajendra Devarapalli said...

హి హి హి :) నమ్మం

teresa said...

Brilliant!

Anonymous said...

Naa peru Prasadu. Government aakuku jebulo pettukoni, avi egiri bayata padedaaka kottinchukunna eevida gari thammudini nene. Maa akka jadalo pettukundi aakulu aa roju. Avi kooda egiri paddaayi maa nanna debbalaku. :) ha ha ha.

జ్యోతి said...

హ..హ..హా..

భలే ఉంది గవర్నమెంటు ఆకుల దెబ్బలు. ప్రవేట్ చెట్లు, ఆకులు ఉన్నాయా??

Kathi Mahesh Kumar said...

బాగుంది.గవర్నమెంటు ముళ్ళు మనకూ ఎరుకే! మాది మదన్పల్లిదగ్గర వాయల్పాడులే.

అయినా అమ్మీ! మనపక్క పేకాటన, చీట్లాటంటాంగదా? ఆమాటే వాడేస్తేపోలా.

కొత్త పాళీ said...

మీరు బ్లాగ్లోకంలో అడుగెట్టిన వేళ మహా మంచిదల్లే ఉంది.
ఆకుల మహాత్యమేమో గానీ ఈ చెట్ల ముళ్ళ మహాత్యం మాత్రం చిన్నతనంలో నేను బానే ఎరుగుదును.