Tuesday, September 25, 2012

ఇనాయకుడికి ఈపుగాల్తే...

 
ఇనాయకుడికేంది...ఈపుగాలేదేంది అని ఇకిలించేస్తా వుండారా?? ఈయమ్మి సమచ్చరానికోసారి వొచ్చి ఏదోటి వాగతావుంటాదని ఎక్కిరించేద్దారని అనుకునేస్తావుండారా? నేంజెప్పేది లాస్టుదాకా ఇని అప్పుడు జెప్పండి.
 
మీకో రెండు ఇసయాలు జెప్తా..ఇనండి.
 
వాన్లు సరిగ్గే వొస్తే ఇనాయకుడి పండక్కంతా పైర్లు నాటుకోను కస్టం లేకుండా వూర్లల్లో నీల్లుండాల.
మావూర్లో ఐతే ఇనాయకుడి పండక్కి మనకి తాగేదానికి నీల్లున్నా ల్యాకున్నా దేముడికి మాత్రం నూటెనిమిది బిందిలు నీల్లుబొయ్యాల. సిన్నంగా వుండే మొగపిల్లోన్ని యెతికిబట్టుకోని, వోడికో తుండుగుడ్డగట్టి, ముందు వోడికి నీల్లుబోసి, గుడికాడికి తొడకస్తారు. ఆడికొచ్చినంక ఆ వుండే తుండుగుడ్డ గూడా ఇప్పేసి చిన్న శెమ్మొకటి ఇచ్చి దేవుడి నెత్తిన అదేపనిగా నూటెమ్మిది బిందిలు నీల్లుబోయిస్తారు.
 
వూర్లో వుండే ఇండ్లోల్లు నాకొడుకుతొ పోయిచ్చండి అంటే నాకొడుకుతో పోయిచ్చండని కొట్లాడుకుంటా వుంటే చిన్న పిలకాయలు సిగ్గుతో సచ్చిపోయేవోల్లు. సిగ్గుతో సస్తా నీల్లుపోస్తా వుంటే " పెద్దమొగోడీడు..మూస్కొని పొయ్యివయ్ " అని పెద్దోల్లంతా తిట్టేవోల్లు. 
 
అట్ట వొగపక్క నీల్లుబోస్తావుంటే ఇంగోపక్క భోరుమని వాన కురిసిపొయ్యేటిది.
 
ఇప్పుడా..వూర్లల్లో పిలకాయలే లేరు..ఇద్దురో ముగ్గురో వున్యా గుడ్లేసుకోనే పుట్నెట్టు వొంటిమింద శొక్కాయి తీరు. ఇంగేడొస్తాయి...దెస్టబట్నె వాన్లు. వానాలే...వంకాలే. అద్దోఇద్దోరని మొబ్బేసుకోని వుంటాయిగానీ...వొచ్చేదీలే...సచ్చేదీలే.
 
నేను సిన్నప్పుడు నీల్లుబోస్తే వానొచ్చేది. అదే మాయవ్వ చిన్నప్పుడు ఏంజేసినారో తెలుసునా?
నాకు మాయవ్వ జెప్తావుంటే ఒకటేనవ్వు. దేవుడికి వుండీలో దుడ్డేసి, పొంగిలిబెట్టి వాన్లు గావాలని మొక్కుంటే ఏం లాబంల్యా. అందుకే మా తాతోల్లు ఇనాయకుడి పండగజేసి, మూడ్రోజులు పూజ్జేసి, కుడుములుబెట్టి బొమ్మను జల్దిలోగలిపేదానికి చెరువుకాడికి బొయ్యేదంట. 
 
ఆడ కర్పూరం ఎలిగిచ్చేసి, ఎర్నీల్లు దీసేసి పూజి ముగించేసేదంట. దేవుడ్ని సల్లగా నీల్లల్లోబెడ్తే ఆయినికి సేద్యంజేసేవోల్ల నొప్పిదెలీదని చెర్లో నీల్లుంటేగూడా, వొడ్న బెట్టేసి సక్కా వొచ్చేసేవోల్లంట. వొకట్రెండు దినాలు నొప్పి బిగపడ్తే కూడా, ఎండకు ఈపుగాల్తా వుంటే అల్లాడిపోయేవొడంట ఇనాయకుడు.
 
మూడోదినం ఎండొచ్చేప్పటికి మొబ్బులేసుకునేవంట. చెర్లో ఇనాయకుడి బొమ్మ కరిగేదాకా వొకటే వాన కురిశేదంట. ...వొద్దుసామీ వొద్దనేదాకా, వొంకలొచ్చేదాకా, నీల్లల్లో నానీ నానీ కాల్లకు అడుసుపుండ్లొచ్చేదాకా....కురస్తానే వుండేదంట.
 
అట్టని ఇనాయకుడంటే మావూరోల్లకు ఆయనంటే ఇస్టం లేదనుకునేరు. ఆడ ఇంటికో ఇనాయకి వుంది. మొగపిల్లోడైతే ఇగ్నేస్పర, ఆడబిడ్డైతే ఇనాయకి అని పిల్సుకుంటారు.
 
ఇదేంటికి జెప్తా వుండానంటే ... ఇప్పుడెట్టా యాడా నీల్లులేవు. అడుగో బొడుగో ఉండే నీల్లల్లో ఇనాయకుడి బొమ్మలు ఏసేసి, ఆ వుండే సుక్కా పాడుజేసుకోకుండా మనందరం వొక పెమాణం జేసుకుందారి. బొమ్మలన్నీ ఎత్తకపొయ్యి ఎండలోబెట్టేద్దారి. అన్ని ఇనాయకుల్లకి ఈపుగాల్తే వానరాకుండా యాడికిబొతాదో సూద్దారి. ...సరేనా???

Thursday, July 14, 2011

యాడుండావు కల్యాణీ?


ఆడది ఎవురూ తోడు లేకండా బతకలేదని, మొగేసం కట్టి మొగోడిలా బతకమని మీయవ్వ నీకు శెప్పింది నిజిమేనేమో! అవ్వ సచ్చిపొయ్యేదాక నువ్వెట్టా పెరిగినావోగానీ... నువ్వు రేణిగుంట నించి తిరపతికి వొచ్చినాక, కస్టంలో నిన్ను వొదిలేశినానని నాకు ఈ రోజుగ్గూడా ఎంత బాధో తెలుసునా? కల్యాణ్ అని పేరు నువ్వే పెట్టుకోని, గాంధీరోడ్డు సందులో పాతగుడ్డలు కొనుక్కోని, మగోడిగా మారి ఐదేండ్లు ఐనా ఎవురూ కనుక్కోలేదని యిని నాకెంత కుశాలైందో తెలుసునా. నీకు జుట్టు కత్తిరించే మంగలోడికిగూడా నువ్వు ఆడదో, మొగోడో తెలీదని నువ్వు శెప్తా ఉంటే నీ తెలివికి నా నోరు తెరసక పోయింది గదా.


నేను తిరప్తిలో పని చేసేటప్పుడు విజీలచ్మి నిన్ను తొడుకోని నా దగ్గిరికి వొచ్చిన్రోజు నాకింకా గుర్తుండాది. నన్నెదుక్కుంటా వచ్హిన బంగారట్టా బిడ్డెను మల్లీ గాలికొదిలేస్తిమే అని మనేదే నాకీరోజుగ్గూడా. తిరప్తి రైలుటేసను కాడ రోడ్లో ఉండే 'మందు ' అంగిడిలో నువ్వు పంజేస్తావని చెప్తే అప్పుడేగదా నేను నిన్ను జూసింది! నిజిం జెప్తా జూడు. తొల్తలో నేను గూడా నిన్ను మొగపిల్లోడనే అనుకునేసినా.

వొల్లంతా దెబ్బలు తగిలిచ్హుకోని, రక్తం కారతా ఉంటే...ఏమైందని అడిగితే విజీలచ్మి ఏం జెప్పింది?
మందంగిడి ఓనరు కొడుకు, ముందురోజు రాత్రి నిన్ను చెయ్యిబట్టుకోని లాగి, నిన్ను చెరచాలనుకున్నాడని, నువ్వు పరిగిత్తాఉంటే రాయితో ఇసిరేసినాడని, కమ్మితో కొట్నాడని, నువ్వు రాత్రంతా ఎట్టోకట్ట దాంకోని, తెల్లారైతానే విజీలచ్మి వోల్లకు కనిపించినావని చెప్తా ఉంటే నాకు వొంట్లో రక్తమే రంగుమారి కంట్లో నించి బైటకు వొచ్చింది గదా. మగోడి మాదిరిగా నువ్వు బతకతా ఉంటేగూడ మగెదవలకి నీ ఆడ వొళ్ళు కనిపిచ్చిందంటే తప్పు ఎవురిదని అనుకోవాల.


ఆరోజు నీతో మాట్టాడేసి, నా కోప్మంతా పేపర్లో రాసేసినా గదా. నిన్ను బైటకు పంపిస్తే ఆ యెదవలు మల్లీ ఎమైనా జేస్తారని నిన్నెత్తక పోయి 'రైజ్' లో పెట్టిస్తి గదా. ఆడ వాళ్ళింట్లో పని జేయిపిస్తా ఉండారంటే గూడా నేను బాధపడ్లా. యాడో వొకచోట నెమ్మదిగా ఉందిలే అనుకుంటి. కేసులు పెట్టద్దు , డబ్బిస్తామని లాయిరు వొస్తే, నీకు న్నాయం జరగాలని పోరాడితి గదా! వినాయిక చెవితి పండగ రోజు ఆఫీసుకాడికి నువ్వు కుడుములు ఎత్తకస్తే కంట్లో నీల్లొచ్చినాయి నాకు. ఎవురీబిడ్డె? నేనంటే ఏంటికింత ఆశి? అని శానాతూర్లు నాకు కండ్లమ్మట నీళ్ళొస్తే అప్పుడప్పుడూ కొంచిం కులుగ్గాగూడా ఉణ్ణింది. నిన్ను మా ఇంటికి తొడుకోని పోయి పెట్టుకుందామంటే, నేనే ఉద్దోగంకోసం ఇంగోరి ఇంట్లో ఉండా గదా! నువ్వు అప్పుడప్పుడూ ఫోను జేసి ' అక్కా!' అని పిలస్తా వుంటే భలే కుశాలగా ఉణ్ణింది నాకు.


వొకరోజు నిన్నింట్లో పెట్టుకున్నోళ్ళొచ్హి ' కల్యాణి ' యాడకో పూడ్సిందని చెప్తే ఊపిరి నిల్చిపోయింది నాకు. యాడకు పోయింది మీకు జెప్పకుండా అంటే ' ఏమో తెలీదని ' తప్పించుకునేసిరి. యెతికి యెతికి నేనుగూడా అల్సిపోతి. యాడుండావో తెలీదు..నిన్నెట్ట ఎతకాలో తెలీదు. వోళ్ళకు నేను ముందే జెప్పిపెట్నా...ఆ బిడ్డెని ఇంట్లోనే బెట్టుకోండ..ఆస్టల్లో వొద్దని. డబ్బిస్తామనిజెప్పిన లాయిరూ, రైజోళ్ళూ ఒగిటైపోయినట్టు ఇప్పిటికీ నాకు అనిపిస్తింది. నేనొద్దన్నా నిన్ను ఎత్తకపొయ్యి జీవకోనలో ఆస్టల్లో పెట్నారా?.. ముందు నిన్ను మా ఇంట్లోనే పెట్టుకుంటానని జెప్పినోళ్ళు , నీకు శానా తెలివుందని పొగిడ్నోళ్ళు పది రోజులుగూడా కాకముందే బైటికి బంపిచేశిరా? ఆడ నేనుండనని నువ్వు ఏడిస్తేగూడా మళ్ళీ పొమ్మన్రి కదా? నిన్ను కావల్సికే పంపించేసినారేమో అనిపిస్తావుంటింది నాకు. మైనరు బిడ్డెకు జరిగిండే అన్నేయం గవుర్నరుకు తెలిసి పెద్ద కేసయ్యేటప్పటికి వోల్లంతా ఒగిటైపోయినారు కదా!


మళ్ళెప్పుడో ఒకసారి నన్నూ నిన్నూ కూడా తెల్సినోళ్ళు కనిపిచ్చి ఏంజెప్పిరో తెల్సా కల్యాణీ? తిరుగుబోతు బిడ్డెనుదెచ్చి ఇంట్లోబెడ్తే యాడుంటుంది..మళ్ళీ ఈదిలోకేబోయింది. మొన్న మేము సిన్మాకుబోతే గ్రూపు కొటాయిలకాడ బ్లాకులో టిక్కెట్లమ్మతాఉండాది. నన్నుజూసి పిలస్తావుంటే పరిగెత్తిపొయ్యింది అని. అది ఇంటానే నేను మళ్ళీ కొటాయిలకాడ ఎతికిచ్చినా నీ కోసరం. నువ్వు కనిపీలా నాకు. ఇప్పిటికీ తిరప్తికి వస్తే, ఎవురన్నా ఈదుల్లో తిరిగే పిలకాయిలు కనిపిస్తే నువ్వుండావేమో అని రెండుతూర్లు వాల్లకల్లా జూస్తా. ఈసారి ఎప్పుడైనా కనిపించినావనుకో! మళ్ళీ వొదల్ను నిన్ను.


నీ కస్టమేందో నాకు జెప్పుకో. నువ్వెందుకు మళ్ళీ బైటకు పొయ్యినావో నన్నుగూడా ఇన్నీ. నేనోడిపొయ్యినానో, అందురూ కలిసి నిన్నోడిచ్చినారో మాట్లాడుకుందాం. మల్లీ నా కంట్లో నీళ్ళొచ్చేదాకా ' అక్కా! ' అని పిలువ్. నాతో వొచ్చెయ్. నా గుండెలోనే కాదు, నీ కిప్పుడు మాఇంట్లో గూడా తావుండాది. కస్టాలుబెట్టే రోడ్లు, రైలుటేసన్లు నీకొద్దు. నిన్నుజూసి పదేండ్లయినా కండ్లల్లోనే మెదల్తా ఉండావు. పది, పన్నెండేండ్లకే నిన్ను వొదల్లేదే... ఇప్పుడేమైపోయినావో అని గుండె గభీమంటాది నాకు.


తిరుగుబోతు పిలకాయిలు ఇంట్లో ఉండాలంటే వోళ్ళకు మన గుండెలో తావీయాలని మనిద్దరం అందురికీ చెప్దాం కల్యాణీ! వొచ్చెయ్ నా దగ్గిరికి.