భూషణ్ సర్ నన్నొదిలి పోయాడు పైలోకాలకు .
ఎందరినో తన చిత్రాలతో అందమైన జ్ఞాపకాలుగా మిగిల్చిన గొల్లపల్లి నాగభూషణం తానూ భూషణంగానే మిగిలిపోయాడు. ఛాయాచిత్ర ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన బ్రహ్మచారి, ఇంటిలో కాలు పెట్టగానే నా కడుపు నిండుగా శాండ్విచ్ పెట్టాకే క్లాసు మొదలుపెట్టిన ఆత్మీయుడు ఆయన . మధ్యాహ్నం స్వయంగా వంట చేసి, తొలిముద్ద ఉసిరికాయ ఊరగాయతో తినాలని నెయ్యి కలిపిన వేడి అన్నంలో ఊరగాయ కలిపి నా చేతిలో పెట్టిన ప్రేమమూర్తి ఇకలేరు.
ఉదయాన్నే ఆయన మరణవార్త మనసుని కలచివేసింది . జ్ఞాపకాల తుట్టెని కదిలించింది.
ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించేవారాయన. తన టేబుల్ పై బాగా పాతదై పోయి, పగిలిపోయిన ఒక కాలిక్యులేటర్ ఒకటి వుండేది ఎప్పుడూ. వంద రూపాయలు ఇచ్చి నటి సూర్యకాంతం దగ్గర కొనుక్కున్నానని దాన్ని చూసి మురిసిపోతూ ఉండేవారు.
కీచైన్ కెమెరా మొదలుకుని నల్ల బట్టను కెమెరా షట్టర్ లా వాడిన పాత కెమెరా వరకు ఆయన దగ్గర ఉండేవి. ఎన్టీరామారావు గారి ఫోటోలు , బాపు రమణల చిత్రాలు ఆయన దగ్గర వేల సంఖ్యలో వున్నాయి. వాటిని ఎలా భద్రపరచాలోనని ప్రతి నిముషం ఆలోచించేవారు ఆయన . ఇల్లంతా బైండింగ్, కట్టింగ్. ల్యామినేషన్ యంత్రాలతో నిండిపోయి వుండేది. నేను ఆయన్ని కలిసి నప్పుడు ఆయన వయసు డెబ్భై. అయినా ఒక్క నిముషం కూడా ఏ పనీ చేయకుండా కూర్చునేవారు కాదు.
రోజంతా ఏదో ఒక పని చేసుకుంటా వున్నా స్నేహితులని మరిచేవారు కాదు. సాయంత్రమైతే స్నేహితులు , పేకముక్కలతో వొంటరితనాన్ని మరిచిపోయే వారనుకుంటా. పుస్తకాలలో , మేధావుల మాటల్లో మాత్రమే నేను వినగలిగే ముళ్ళపూడి వెంకటరమణ , బాపు గార్లు ఆయనకు స్నేహితులు . ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన దగ్గరే ఉండేవారు ... వచ్చినప్పుడు. నేను వారిని అక్కడే కలిశాను .
పాత బుల్లెట్ ఒకటి వుండేది భూషణ్ గారి దగ్గర . దానిమీద సిటీ అంతా తిరిగేవారు . ఆయన వయసుని దృష్టి లో ఉంచుకుని జాగ్రత్తగా వుండండి అంటే .... నాకెంత ... జస్ట్ ఇరవై ఏడేళ్ళే అని నవ్వేవారు. తన తర్వాత ఫోటోలు , నెగెటివ్ లు ఎవరు జాగ్రత్త చేస్తారో నని వెతుక్కునేవారు.
గుండె జబ్బున్నా, కాన్సర్ సోకినా నేను ఫోన్ చేసిన ప్రతిసారీ ఆరోగ్యంగా ఉన్నానని అబద్దాలు చెప్పారు. గత నెలలో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలవాలనే అనుకున్నా.... కుదరలేదు . చివరి చూపులకు కూడా రానందుకు మీ గర్ల్ ఫ్రెండ్ ని క్షమిస్తారు కదూ?
మీ ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలతో ప్రార్థిస్తున్నా.
No comments:
Post a Comment