Friday, March 1, 2013

కొత్త సమచ్చరం ఇద్దో ఇట్ట జరిగింది

మార్చి 2013




గుడ్లింతింత సేస్కోని ….గుండెలు గుబగుబ లాడ్తా వుంటే నాలుగుదిక్కలా సూస్తా….ఓయమ్మో..ఏం సేస్తా వుండారు వీల్లు..అనుకుంటా అందుర్లో బీసురోమని కూచ్చోనుండా.
కొత్త సమచ్చరం … ఆడతా..పాడతా పండగ మాదిరి జరిపితే బాగుంటిందని వేల రూపాయిలు కట్టి టిక్కెట్టు కొనుక్కోని బెంగ్లూర్లో …ఇద్దో ఈడికొచ్చినామా!
లైన్లో నిలబడుకోని వస్తావుంటే … వీల్లు ఆడోల్లేనా అనిపిస్తా వుంది…ఒక్కోర్ని జూస్తావుంటే! యాడో ఆడొక బిడ్డె…ఆడొక బిడ్డె తప్పితే…ఒక్కరన్నా సమంగా గుడ్లేసుకున్నారా!
అవ్వ! ఆడది నాకే గొంతెండక పోతాంది. మొగోల్ల కత ఇంక యేరే జెప్పాల్నా..
సిన్నప్పుడు ఉడుగ్గా ఉందని ఇంట్లో పొడుగు షిమ్మీ యేస్కోంటేనే…మాయమ్మ పొరకెత్తుకుంటావుండె. సంకల కాడ్నించి తొడలకాడికి నల్లగుడ్డలు సుట్టుకోని ఈమాదిరి ఇంతమందిలోకి వొచ్చేస్తే..వాళ్ళమ్మా నాయిన్లు ఏమన్రా?? మొగపిలకాయల్తో ఈమాదిరి ఊరిమింద పడి తిరగతాంటే ఏమన్రా?? వోళ్ళకు తెలీకుండా వొచ్చేస్తారేమో! యాడో ప్రెండింటికి పోతామని జల్లిజెప్పేసి ఇట్టొచ్చేస్తారేమో! ఇంట్లో ఉండేవోళ్ళకు ఇయ్యన్నీ ఎట్టదేస్తాయిలే! ఈమాదిరి అనుకుంటా నేను లైన్లో నడస్తావుండా. ఆడోల్ల కల్లా సూస్తే నాకే సిగ్గుగా ఉండాది…మొగోల్ల కల్లా సూస్తే వాల్ల కల్లల్లోనే పండగ కనిపిస్తావుండాది. ఇంగ లోపలెట్టుండాదో అనుకుంటా పొయినా.
లోపల బాగనే ఉంది. లైట్లు గీట్లు బాగ యేశిండారు. ఇందీ సిన్మా పాట్లు చెవులు పగిలిపొయ్యేట్టు మైకుసెట్లో ఇనిపిస్తా వుండాయి.ఇంకోపక్కంతా.. పేర్లు శెప్పలేను గానీ..రకరకాల భోజనాలుండాయి.ఐతే ఒగిటీ నోట్లో పెట్టనుగాలా…సల్లగా..సప్పగా..

కొంచేపైనాక అందురూ ఇస్టేజీ కాడికి పోతావుంటే మేం గూడా పొయినాం. ఎవురో నలుగురు పిలకాయిలు…పాటలు పాడ్తావుంటే అందురూ డేన్సులు కట్టిండారు.
డేన్సులంటే మనం సినిమాలో జూసేవి కాదు…వూరికే ఎగర్తా వుండారు. పైనుండే నలుగురు పిలకాయిల్లో ఇద్దురు జుట్టుపోలిగాళ్ళు. నాకంటే పొడుగ్గా జుట్టు పెంచుకోనుండారు. ఇంగిలీసు, ఇందీ పాటలు పాడ్తావుండారు…బెంగ్లూరు..బెంగ్లూరు అంటా.
ఒకరగంటైనాక పాటలు నిలిపేసినారు. జెర్మనీ నించి ఒకామె వొచ్చి బెల్లీ డేన్సు యాస్తా వుంది. ఇస్టేజీ పైన ఆమె నడుం తిప్పితే కిందుండే వోల్లు వో..అని అరస్తా వుండారు. వోల్ల ఎదురుగా వుండే ఆడోల్ల నడుములు తిప్పేస్తా వుండారు. మావూర్లో ఈమాదిరి ఒకర్నొకరు పట్టుకుంటే బొట్టయినా గట్టాల…మెట్టుదెబ్బలన్నా తినాల.
అందరూ జల్లు కారస్తా వుండంగానే ఆ బిడ్డె నొవస్కారం పెట్టేసి పూడ్సింది. మల్లీ రమ్మని అందురూ ఒగటే అరుపులు. అంతకుముందర పాటలు పాడిండే జుట్టోల్లు మల్లీ వస్తే వోళ్ళను డాన్సులు ఎయ్ మంటాండారు.అప్పుటికి సుమారుగా పదకొండు ఐతాంది టయిము.ఆకిలిగా వుంటే ఏదోకటి తినేద్దారని బోజనాలకాడికి తిరుక్కోని వస్తిమి మళ్ళీ.
భోజనాల లయిను కంటే మందుకాడ లయిను పొడుగ్గా వుండాది. చిన్నగుడ్లేసుకునిండే ఆడోల్లు ఈడగూడా తోస్కుంటా తోస్కుంటా ప్లాస్టిక్ గలాసులు పట్టుకోని నిలబడుకోనుండారు. గలాసులు నిండుకూ మందు పోసుకున్నోల్లు నీల్లు తాగినట్టు తాగేస్తా వుండారు. కూడా వుండే మొగపిలకాయిలు తాగు తాగు అంటా కొందరికి బలవంతంగా తాపిచ్చేస్తా వుండారు.
ఎట్టోకట్ట నచ్చిన కూడు ప్లేట్లో యేస్కోని కుచ్చుందామంటే యాడుండాయి కుర్చీలు..?? ఎవురన్నా పైకి లేస్తే సాలు..పక్కనే కాస్కోనుండే మాలాంటోల్లు టపిక్కిన కుచ్చునేస్తా వుండారు.
మేంగూడా అదేపని జేసినాం. పక్కనోల్ల కల్లా దొంగసూపులు జూస్తా తింటాండాం.
కొంచేపటికి పక్కన్నే ఎవురో బుడక్కని కక్కేసినారు. అందురూ ఆబిడ్డికల్లా సూసినాం. పక్కన్నే ఉండే మొగపిల్లగాడు శెవులు మూశిపెట్టి ఏంగాదులే అంటాండాడు. అన్నమేమన్నా బాగలేదా అని మాకు అన్నంపైన డౌటొచ్చేసింది. తినేది నిలిపేసి సూస్తావుంటే ఇంకో పక్క…ఇంకోపక్క…యాడజూసినా కక్కులే కక్కులు.
నాకైతే ఎవురన్నా కక్కతా వుంటే కడుపులో తిప్పేస్తింది. అందుకని దూరంగా లేసిపోయి కూచ్చున్నా..
మల్లి దెలిసింది అసలు కత…అందురూ ఫుల్లుగా మందు కొటేసి …ఎక్కువైపోయి కక్కతా వుండారని. బాత్రూములు కాడ, సిమ్మింగుపూలు కాడ, ఇస్టేజీకాడ ….యాడబడితే ఆడ ఆడోల్లు మొగోల్లు తేడాలేకుండా ఎక్కువైందంతా వాక్క్…వాక్క్ అని కక్కతా వుండారు. ఇంకొందరు సందు దొరికిందే సాలని మత్తెక్కువైపోయినట్టు ఒకరిమింద ఒకరు పడిపోయి యాక్సన్లు జేస్తావుండారు.
ఈలోపల కొత్త సమత్సరం వొచ్చేసిందని టపాసులు కాల్చేది మొదులుబెట్టేసినారు. వాటిని జూడాల్నో, ఈ తాగుబోతు యాపారం జూడాల్నో..ఏమర్థంగాలా నాకు. క్యూలో తెరిసిన నోరు..ఇంగా మూతపడక ముందే ఇంటికి పూడద్దామని బైల్దేర్నాం.
నామొకం జూసి నాతో వొచ్చిన వోళ్ళన్నారు… పార్టీలంటే ఇట్టే వుంటాయని.
మావూర్లో కూడా రాత్తుర్లో మేలుకోని పార్టీలు జేస్తారు. శివరాత్రికి..జాతర్లకి..అందురూ చిన్నంతరం పెద్దంతరం లేకుండా కుంటాట, తొక్కుడుబిల్లాట, కబడీ, జిల్లంగోడి ఆడుకుంటాము. పాటలు పాడుకుంటాము…పలక్కొడితే వొళ్ళు మరిచిపొయ్యి డాన్సులు యాస్తాము. సారాయి కూడా తాగతారు కొందురు. మొగోల్లు మాత్రమే కాదు..కొందురు ఆడోల్లు కూడా. ఎంతకావాలో అంతే తాగతారు. తాగేసి గొమ్మునే వుంటారు. తాగేసి కక్కేది, ఆడోల్లు మొగోల్ల మిందా, మొగోల్లు ఆడోల్ల మిందా పడిపొయ్యేది జరగదు.
మవూర్లో మందుకొట్టే ఆడోళ్ళెవురూ సదుంకోలేదు.ఐనా వోళ్ళకు యాడ ఎట్టా వుండాలో తెలుసు. ఎవుర్తో ఎంత దూరంగా వుండాలో తెల్సు. ఎవురన్నా అతిజేస్తే ఏంజెయ్యాలో కూడా తెల్సు.కట్టు దాటకుండా పతిరోజూ పండగెట్ట జేసుకోవాలో తెలుసు. పార్టీ లంటే బట్టలిప్పేయడం కాదని, మందుకొట్టి వాంతులు జేసుకోవడం కాదని, ఆడోళ్ళకు మొగోల్లకు మద్దెన కనిపీకుండా వుండే గీటును దాటేయడం కాదని ఈరోజు పార్టీలో ఎగిర్నోళ్ళకు ఎవురు జెప్తారబ్బా….ఇద్దో ఇట్ట నేను మనేది పెట్టుకోని వుంటే పక్కన్నే మా సుబ్బారావు సెల్లుపోను రింగయ్యింది.
ఆపక్కున్నుంచెవురో పార్టీ బాగ జరిగిందా అని అడగతావుండారు. అన్లిమిటెడ్ ఫుడ్…అన్లిమిటెడ్ మందు…లిమిటెడ్ డ్రెస్సులు …సుబ్బారావు జెప్తాండాడు.నో..నో..అనో..నన్నుగూడా పిల్సింటేమినా …నేనుగూడా వొచ్చి సూసింటా గదా?? అంటాండాడు ఆపక్కన…ఒళ్ళుమండి పోను లాక్కోని అపుజేసేసినా… ఎవురుమారస్తారు వీళ్ళందర్నీ???
నేనుమాత్తరం ఇంగోసారి ఇద్దో ఇట్టాంటి సోటికి ఎప్పుడూ రాగూడ్దనుకునేసినా..పోతే మావూరికి బొయ్ ఒంటిగా ఐనా కయ్యల్లెమ్మట…కాలువలెమ్మట తిరుక్కుంటా గానీ ఈ గోస నాకొద్దురా సామీ అనుకునేసినా …



http://vaakili.com/patrika/?p=1712

2 comments:

Raghuram said...

Oh my god.....!!! how did I miss this blog these many days.....గుక్క తిప్పుకోకుండా అన్ని టపాలు(posts) ఒక్క మోటున చదివేసి, సానా సంతోసపడిపోయన....జాన్సక్క( ఝాన్సి అక్క) ఎంతబాగా రాసిందో అని....కథనం అద్భుతం.... super akka ...keep it up

జ్యోతిర్మయి said...

సీమ భాషలో ఎంత బాగా వ్రాసారు.
మీరు ఊరెల్లేప్పుడు నన్ను పిలవడం మరచిపోకండి. కయ్యమింద కొత్త సమత్సరం పండగ జేసుకుందాం.