Monday, October 6, 2008

గోయిందల పండక్కు మా వూరికి పొయ్యి గోయిందలు పెట్టొచ్చినాం...:)

ప్రతి యేడాదీ మూడో శనివారం మా తాతకు గుడ్డలు పెడ్తాం...
ఆయన నేను చిన్నబిడ్డగా ఉన్నప్పుడే సచ్చిపోయినాడు. మా తాతకు మూడో తిరవలి శనివారం అంటే చానా ఇష్టమంట. పూజసామాను, సరుకులు తెచ్చేదానికి మోటరు బైకులో చిత్తూరుకు పోతావుంటే లారీనో, బస్సో గుద్దేసిందంట. అక్కడ్నుంచి బస్సులో పెద్దాసుపత్రికి యేసుకోని పొయ్యేటప్పటికే సచ్చిపోయినాడంట. పండక్కు ముందు రోజే సచ్చిపోయినాడు కాబట్టి,ఆయనకు గోయిందల పండగంటే ఇష్టం కాబట్టి మా తాతకు ఆరోజే గుడ్డలు పెడ్తాం.ఆరోజు ఇంట్లో పూజ అయిపోయినాక ఈదిలోగూడా పూజ్జెయ్యాల. ఇంటిముందర నీళ్ళుజల్లి, సలిబిండి దీపం పెట్టి, కర్పూరం దిగదియ్యాల. అయినాక మూడుసార్లు గోయిందలు పెట్టాల. ఆరోజు ఇంట్లో మొగోళ్ళందురూ నాముకొమ్ము రుద్ది యెంగటేస్పర సామి నామాలు మాదిరిగా పెట్టుకోవాల.

గోయిందల పండక్కని మేమందురూ మా తాతోళ్ళ ఊరికి పోయినాం ...మొన్న మూడో శనివారం.అరిటాకులు కూడా ఇక్కడ్నుంచే కొనుక్కోని పోయినాం. అందురూ వక్కపొద్దు ఆ రోజు. నట్టింట్లో తళిగేసి, మా తాతకు ఇష్టమైన వంటలన్నీ వండి పెట్నాము. సామ్రాణి పొగేసినాము. ఇంట్లో పూజ చేసేసినారు. బయటికి వచ్చినాం. ఆడ గోయిందలు పెట్టాల ఇంక.

మేమందురూ బాగనే చదువుకునేసినాం. గట్టిగా గోయిందా! అనాలంటే అందరికీ సిగ్గు. ఇంతకు ముందొక సారి మా తమ్ముడు గోయిందా..గోయిందా..గోయింద! అనలేదని మా నాయిన వాడిని గేటు బయటే నిలబెట్టి గేటు యేసేసినాడు.' వాడు గోయిందా! అనకుంటే అన్నంగూడా పెట్టద్దని మాయమ్మకు చెప్పినాడు. వాడిప్పుడు అమెరికాకు పోయి గోయిందలు పెట్టే బాధ నుండి తప్పించుకునేసినాడు.

మావూరి వాస్తు సరిగ్గా లేకనో, పరిస్థితులు బాగలేకనో ఇప్పుడెవరూ వూర్లో ఉండటం లేదు.. నా చిన్నప్పుడు ఊరంతా మనుషులే. ఇప్పుడు ఇంటికి ఒకరు కూడా లేరు.ఈరోజో రేపో సచ్చిపొయ్యేదానికి రెడీగా ఉండేవాళ్ళు, వూరొదిలి పెట్టి యాడికి పొయ్యేదని అనుకునేవాళ్ళు కొందురు మాత్రమే ఇప్పుడు మావూర్లో ఉండారు. మేము గూడా వూర్లో ఎందుకుండేదని అప్పుడెప్పుడో టౌనులోకి వచ్చేసినోళ్ళమే. కానీ అప్పుడప్పుడు నేను చిన్నప్పుడు ఆటాడుకున్న ఊరు ఇప్పుడు శ్మశానమై పోయిందని బాధగా వుంటింది. చిన్నప్పుడు అందరూ మూడో శనివారమంటే మా ఇంటికి వచ్చి మొక్కోని పొయ్యేవాళ్ళు. అందరూ అందరిండ్లకూ పొయ్యి గోయిందలు పెట్టేసి మళ్ళి వొక్కపొద్దు ఇడిశేది.

వూరొదిలేసి వచ్చి, ఇక్కడెక్కడో ఏంది పండగ జేసేదని మా మామ వూర్లోనే ఇల్లు కట్టేసి రెండేళ్ళ నుండి ఆడే గుడ్డలు పెడ్తావుండాడు. పండక్కోసం ఊరికిపోతే చిన్నప్పుడు జరిగినాయన్నీ గుర్తొస్తా ఉంటాయి. చెట్టెక్కి ఆడుకున్న ఆటలు, జిల్లంగోడి ఆడి దోవలో వచ్చేపొయ్యే వాళ్ళ మూతి పగలకొట్టడాలు, నిద్రపొమ్మంటే అమ్మని నిద్రపించి దొంగలా బయటికొచ్చి దాయాలు ఆడటాలు...అన్నీ, అన్నీ గుర్తొస్తాయి.

బాగా సదువుకునేసి, పెద్దయిపోయినాక గోయిందలు పెట్టేదానికి కొంచెం కష్టంగానే ఉన్నా...వచ్చే సమచ్చరం వూర్లో అందురూ ఇండ్లకు తిరిగొచ్చి పండగలు చెయ్యాలని...పిన్నమ్మ,పెద్దమ్మ,చిన్నాయిన,పెద్నాయిన,అత్త,మావ,అవ్వ,తాత లతో పల్లె కళకళ లాడాలని ... మా వూరికి యాభై కిలోమీటర్ల దూరంగా కొండమింద ఉండే యెంగటేస్పర సామికి ఇనిపించేటట్టు గట్టిగా పెట్టినా .....

గోయిందా!...గోయిందా!...గోయింద!

12 comments:

చైతన్య.ఎస్ said...

గోయిందా ...గోయిందా. నేను గోయింద పెట్టిన.
అన్నట్టు మీది చిత్తూర్ ఆ. చాల సంతోషం. మొదటి సారి చదువుతున్న మీ బ్లాగ్. బాగుంది.

dhrruva said...

avunu.. monna sanivaram nenu kooda poi vachina. kaani nenu govinda.. govinda ani cheppaledhu. :((

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు.
ఐతే మీ తమ్ముడు అమెరిఖా వచ్చి గోయిందల బాధ తప్పించుకున్నాడనేది అబద్ధం. చిక్కుముడుల్లాంటి ట్రాఫిక్ జాముల్లోనూ, కొండవీటి చాంతాళ్ళ లాంటి వాల్మార్టు చెకవుట్ లైనుల్లోనూ నిలబడి మేవంతా యెట్టేది గోయిందలే! :)
గోయిందా గోయింద!

oremuna said...

బాగా వ్రాశారు. ఐ లవ్ దిస్ స్టైల్. కీప్ రైటింగ్.

చైతన్య కృష్ణ పాటూరు said...

నిజిమే. మా సిన్నప్పుడు తిరపతిలో ఏడజూసినా గోయిందలే ఇనపడేయి. ఇప్పుడు కొండ మీద గర్భగుడిలో తప్ప యాడా ఇనిపిచ్చేదిలా. జనానికి బలే నామోషీ వచ్చేసుండాది.

Kathi Mahesh Kumar said...

అబ్బా..నేను పిలకాయగున్ననాటి ఇశాలు జ్ఞప్తికి దెస్తివే! ఇఅట్టాగైతే ఏట్టబ్బాజేసేది?

Anonymous said...

మేము ఈ మధ్యే తిరుపతి వెళ్లి వచ్చాం
అప్పుడు గోవింద లు ఎవరు పెట్టలేదు కాని
గోవింద నామాలు చదువుతూ ఎక్కాము
దారి అంతటా రాసి వుంటాయి గోవింద నామాలు
ఇప్పుడు మీరు చెప్పారు గా పెడుతున్నా
గోయిందా గోయిందా
గోయింద గోయింద గోయిందా
ఏడుకొండలవాడ గోయిందా
ఏడుకొండలవాడ గోయిందా
ఎంకటరమణుడా గోయిందా
మా పల్లెల్ని కళకళలాడేలా దీవించు తండ్రి


చాల బాగుంది మీ పోస్ట్

Bolloju Baba said...

మీ పోస్టులోని ఆర్ధ్రత నిలువునా ముంచెత్తింది.
బహుసా చాలా టెక్నిక్ తో వ్రాసారనిపిస్తుంది.
ఎక్కడో ఎదో ఉంది.
ఎందుకంటే నిజానికి పోస్టులో చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఏం చెప్పారూ అంటే నతింగ్.
కానీ ఎదో ఉంది. అది తెలుస్తూంది కానీ కనపడాటం లేదు.

మీ పోస్టుని మీ తాతయ్య గారి ఆకస్మిక విషాద మరణం తో మొదలు పెట్టటం వలన ఒక రకమైన తడిని సృష్టించి, దాన్నలా నిలుపుతూ, మద్యలో గోవిందా చెప్పక పోతే భోజనం పెట్టద్దన్న ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించి..... వాహ్ బ్యూటిఫుల్.

చాలా బాగుంది. కధనం. అద్భుతం

అభినందనలతో
బొల్లోజు బాబా

చంద్ర మోహన్ said...

చాలా బాగుంది మీ గోయిందాల కత. నిజమే, నా చిన్నప్పుడు పొరటాసినెల యాడికి పొయ్యినా గోయిందాలే. మేము శైవులం(ట). అందుకని మాయింట్లో గోయిందాల పండగ లేదు. ఐతే ఊరంతా వళ్ళు, పాయిసం జేసుకోని తింటావుంటే మాకెట్లుంటింది! అందుకే పక్కింటోళ్ళ ఇండ్లకాడికిబొయ్యేది, గోయిందాలు అర్చేది, వాళ్ళింట్లో పాయిసం తినేసొచ్చేది. మా బాద పడలేక మాయమ్మగూడా గోయిందాల పండక్కి వడ, పాయిసం చేసేది మొదులు పెట్టింది. అట్ల మాకు గోయిందాల బాద లేకుండానే పండగైపొయ్యేది.

మీ పోస్టు చదవతావుంటే మళ్ళా చిత్తూరులో మా కణ్ణన్ ఐస్కూల్లో మానుకింద కుచ్చోని కతలుచెప్పుకున్న రోజులు జ్ఞాపకం వచ్చేశాయి. మీకు వీలయితే నాకొక మెయిలు పంపించగలరు. kmcmohan@gmail.com కు.

అభినందనలతో

చంద్ర మోహన్

నాగప్రసాద్ said...

గోయిందా ...గోయిందా

నిషిగంధ said...

చాలా చాలా బావుందండీ మీ టపా! ఎన్నో రోజుల తర్వాత నాచేత కూడా గోయిందలు పెట్టించారు!
గోయిందా.. గోయిందా.. గోయింద!

Anonymous said...

ఏందోబ్బా ఈ మద్దెన ఎవుణ్ణి గోయిందలు పెట్టమణ్యా స్టయిలు పడ్తా వుండారు. మా పిల్గానికి ఎంట్రుకలు తీపిచ్చేదానికి బొయినబ్బుడు ఆడుండే నా ఫ్రెండు గాళ్ళు గూడా పెట్లా.నేనే చానా తార్లు పెట్టి నాకు సాలయిపోయింది.
అమ్మయ్యా బ్లాగుల్లో ఇంగోళ్ళు దొరికినారు సిత్తూరు యాస లో రాసేదానికి. సదవతా వుంటే మర్సి పొయిన పదాలన్నీ(తళిగ) గుర్తుకొచ్చినాయి. ఇట్టానే రాస్తుండండి.

మీది పాకాలో పీలేరో గదా? ఎందుకంటే కొండ యాభై కిలోమీటర్లని జెప్పినారు గదా.

-- సిత్తూరు విహారి